
కొత్త మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
ఈ వారంలోనే దరఖాస్తుల స్వీకరణ షురూ..
మొదటి సారిగా గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 163 వైన్స్ షాపులు
నిర్మల్ టౌన్, నవంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో 2021-23 సంవత్సరానికి గాను కొత్త మద్యం పాలసీని ప్రకటిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9 నుంచి 16 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మద్యం షాపులకు టెండర్లు దాఖలు చేసేందుకు జీవో నెం. 98ను విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలుండగా.. ప్రస్తుతం 163 మద్యం షాపులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ప్రభుత్వం ఈ సారి మద్యం షాపుల కేటాయింపులో కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించింది. మొత్తం టెండర్లలో గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం మద్యం దుకాణాలను కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 163 షాపులుండగా.. ఆదిలాబాద్‌లో 26, మంచిర్యాలలో 69, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 31, నిర్మల్‌లో 37 షాపులు ఉండగా.. ఇందులో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు 49శాతం షాపులు రిజర్వేషన్ల ద్వారా దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో గౌడ కులస్తులకు 24, ఎస్సీలకు 17, ఎస్టీలకు 7శాతం దక్కనున్నాయి. మిగతా వాటిలో ఓపెన్ కేటగిరితో పాటు మహిళలకు కూడా రిజర్వేషన్‌ను అమలు చేసేలా ఎక్సైజ్ పాలసీని అమలు చేయనున్నారు.
రేపటి నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా ఎక్సైజ్ కార్యాలయాల్లో మద్యం దుకాణాలు దక్కించుకునేవారు ఎక్సైజ్ పేరిట రూ. 2లక్షలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 9 నుంచి 16 వరకు కొనసాగనున్నది. ఈ నెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వారికి లక్కీడీప్ నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి ఈ నెల 20న లైసెన్సు పత్రాలను అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబరు 1, 2021 నుంచి నవంబరు 30, 2023 వరకు రెండేళ్ల పాటు పాటు మద్యం దుకాణాలను నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాలతో పాటు గ్రామీణ, మున్సిపాలిటీ పరిధిలో జనాభాను బట్టి ఎక్సైజ్‌శాఖ సుంకాన్ని ఖరారు చేశారు. 5వేల లోపు జనాభా ఉంటే రూ. 50వేలు, 5వేల నుంచి 50వేల వరకు ఉంటే రూ. 55వేలు, 55వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే రూ. 60వేలు, లక్ష నుంచి 5లక్షల వరకు రూ. 65వేలు, ఆపైన్న ఉన్న వారికి రూ.లక్షా పదివేల ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు.
వైన్‌షాపులు పెరిగే అవకాశం…
ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 9నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, 18న లక్కీడ్రా, 20న షాపుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్న ప్రభుత్వం అవసరమైతే మద్యం దుకాణాలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఈఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 163 మద్యం దుకాణాలుండగా.. గత నాలుగేళ్ల నుంచి జనాభా పెరిగిపోవడం, కొత్త మండలాలు, మున్సిపాలిటీలు పెరగడంతో కొత్త మండలాల్లో కూడా కొత్త వైన్‌షాపులను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో వైన్‌షాపులను దక్కించుకునేందుకు ఉమ్మడి జిల్లాలో వ్యాపారులు, రాజకీయనేతలు టెండర్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.