
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
వెంగ్వాపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు జాఫ్రాపూర్‌లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం
సోన్, నవంబర్ 7 : వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రైతులు ఇక్కట్లు పడుతున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కొర్రీల వల్లే రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని స్పష్టం చేసిందని తెలిపా రు. ఆదివారం సోన్ మండల కేంద్రంతోపాటు వెంగ్వాపేట్‌లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సహా జాఫ్రాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి అల్లోల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో వరి ధాన్యం ఎక్కువగా పండుతున్నదని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొన్నటివరకు వరి ధాన్యానికి ప్రభుత్వమద్దతు ధర కల్పించిందన్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో 186 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సుమారు లక్షా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లను పెద్దఎత్తున కొత్త వాటిని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
43 సబ్స్టేషన్లను కొత్తగా నిర్మించడం వల్లనే రైతులకు 24 గంటల కరెంటు వస్తోందని తెలిపారు. స్వర్ణవాగుపై 14 చెక్‌డ్యాంలు నిర్మించాలని నిర్ణయించగా, ఏడు పూర్తయ్యాయన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో అన్ని వర్గాలకు చెందిన దేవాలయాలను పునర్నిర్మాణం చేపట్టగా జాఫ్రాపూర్ సాయిబాబా ఆలయానికి రూ.10 లక్షలు, భీమన్న ఆలయానికి రూ.8 లక్షలు, మహాలక్ష్మీ ఆలయానికి రూ.15 లక్షలు, గురిడె కాపు సంఘానికి రూ.5లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్, నిర్మల్, సోన్ ఎంపీపీలు కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, మానస, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద ముత్యంరెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, సోన్, జాఫ్రాపూర్ సర్పంచ్‌లు తిరుక్కోవెల వినోద్‌కుమార్, సునీత ప్రకాశ్, డీసీవో శ్రీనివాస్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ రాజేశ్వర్, నాయకులు కాంతయ్య, దాసరి శ్రీనివాస్, సాయారెడ్డి, మహేందర్ రెడ్డి, నర్సారెడ్డి, హరీశ్ రెడ్డి, కాంతయ్య, తదితరులున్నారు.