
పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
పాఠశాలల్లో ముగ్గులు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు
ఆదిలాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి);రైతుబంధు వారోత్సవాల సందర్భంగా కర్షకులు ఊరూరా సంబురాలు చేసుకుంటున్నారు. శుక్రవారం ఐదో రోజూ ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ‘జై రైతు బంధు.. జైజై కేసీఆర్ ’ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కోటపల్లిలో లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ వేల్పుల పోచన్న వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ఐదో రోజూ రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ మండలంలోని జందాపూర్, పొచ్చెర గ్రామాల్లో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జైనథ్ మండలంలోని బాలాపూర్‌లో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు., బోథ్ మండల కేంద్రంలో ఎంపీపీ ఆధ్వర్యంలో రైతు వేదిక భవనం నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌లో రైతుబంధు చిహ్నంతో తయారు చేయించిన కేక్‌ను కట్ చేసి రైతులకు తినిపించారు. రైతు వేదిక వద్ద కేసీఆర్ భారీ చిత్రపటం గీయించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఇచ్చోడ, బజార్హత్నూర్, తలమడుగు,భీంపూర్ మండల కేంద్రాల్లోనూ సంబురాలు నిర్వహించారు. ఉట్నూర్ మండలంలోని లక్కారం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రైతుబంధుపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు కుంటాల మండలంలోని కల్లూర్ రైతువేదిక, ఖానాపూర్ మండలంలోని గోసంపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రైతుబంధుపై వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేశారు. కాగజ్‌నగర్ మండలం దుర్గానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదిక సమీపంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఏ సర్కారూ గిట్ల ఆలోచన చేయలే..
దస్తురాబాద్, జనవరి 7 : నా పేరు దేశవేణి నర్సయ్య. మాది రాంపూర్ గ్రామం. మా ఊరి శివారులో 4 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. మొన్ననే సర్కారు రైతు బంధు కింద రూ. 20,800ను నా ఖాతాలో జమ చేసింది. ఇది వరకు రైతుల గురించి పట్టించుకున్నోళ్లు లేకుండే. నీళ్లుంటే.. కరెంట్.. కరెంట్ ఉంటే నీళ్లుండేటివి కావు. ఏడాదిల ఒక్కటే పంట వెళ్లేది. ఆ ఒక్క పంట వేసుకుందామనుకున్నా.. పెట్టుబడికి పైసలుండేటివి కావు. ఎట్లనో అట్ల.. పంట తీసినా అప్పులకే సరిపోయేటివి. ఇప్పుడట్లా కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక బతుకులు మారిపోయినయ్. ఉచితంగా కరెంట్ ఇస్తండు. రైతుబంధు కింద డబ్బులిస్తండు. చెరువులను మంచిగ చేయించి పంటలకు నీళ్లిస్తండు. ఇగ ఇంతకన్నా ఏంగావాలే. అప్పట్లో ఏ సర్కారూ కూడా గిట్ల రైతుల కోసం ఆలోచన చేయలే. కేసీఆర్ సారు మాత్రం రైతుల గురించి ఆలోచించి ఎవుసాన్ని బాగా జేస్తుండు.
పైసలకు ఫికర్ లేకుంటైంది
ఖానాపూర్ రూరల్, జనవరి 7 : నా పేరు బీమర్తి పెద్దిరాజు. నేను ఖానాపూర్ మండలం రాజురాలో ఉంటా. నాకు కొడుకు, కూతురు ఉన్నరు. కూతురుకు మొన్ననే పెండ్లి చేసిన. నేను నా భార్య ఇద్దరం కలిసి ఎవుసం చేస్తున్నం. నాకు మా ఊరి చెరువు కింద రెండు ఎకరాల భూమి ఉంది. గీ భూమికి ఏటా రైతుబంధు పైసలు పడ్తున్నయ్. ఎకరానికి రూ. 5 వేల చొప్పున రూ. 10 వేలు వస్తున్నయ్. ఇది వరకు వచ్చిన రైతుబంధు పైసలతో రెండేండ్ల కింద బావి తోడిపిచ్చిన. ఆ తర్వాత వచ్చిన పైసలను పంట పెట్టుబడికి వాడుకున్న. ఎకరంలో పసుపు పంట పెట్టిన. అది ఇప్పుడే చేతికస్తుంది. పైసలు మంచిగనే వస్తయనుకుంటున్న. మిగిలిన ఎకరంలో అర ఎకరం పత్తి వేసిన. ఇప్పటికే రెండుసార్లు అమ్మిన. ఇప్పుడు పత్తికి మస్తు ధర పలుకుతుంది. మార్కెట్లో తొమ్మిది వేల దాకా పెట్టి కొంటున్రు. ఇగ ఇంకో అర ఎకరంలో వరి వేసిన. మార్కెట్లో అమ్ముకున్న. గా పైసలు కూడా నా బ్యాంకు ఖాతాలో పడ్డయ్. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పెట్టుబడికి ఫికర్ లేకుంటైంది. మొన్ననే బ్యాంక్‌కు పోయి పైసలు తెచ్చిన. వెంటనే విత్తనాలు తెచ్చి పెట్టిన. ట్రాక్టర్‌తో దున్నిపిచ్చిన. సర్కారోళ్లు చెప్పినట్లు ఈ సారి నువ్వుల పంట పండిస్త. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధుతో రంది లేకుంటైంది.
అప్పు లేకుండా ఎవుసం చేస్తున్న
దస్తురాబాద్, జనవరి 7 : నా పేరు పార్వతి లచ్చన్న. దస్తురాబాద్ మండలం భూత్కూర్‌లో ఉంటా. నాకు 2 ఎకరాల 28 గుంటల భూమి ఉంది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయంగా రూ. 13,500 వస్తున్నయ్. ఇది వరకు అప్పులు చేసి ఎరువులు, విత్తనాలు తెచ్చేటిది. తెలంగాణ వచ్చినంక రైతుల బతుకులు మారినయ్. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతుల బాధలు తెలుసు. అందుకే రైతుబంధు పథకం తీసుకొచ్చిండు. పంటల సాగుకు ఏటా డబ్బులేస్తుండు. రూపాయి అప్పు లేకుండా పంటలు వేసుకుంటున్నం. ఇది వరకున్న ఏ సర్కారోళ్లు కూడా గిట్ల చేయలే. అసలు రైతుల గురించి పట్టించుకున్నోళ్లే లేకుండే. విత్తనాలు కూడా దొరికేటివి కావు. ఇగ కరెంట్ కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. పగలూ.. రాత్రి కష్టపడితే పంట పండేది. అయినా లాభముండేటిది కాదు. మస్తు తిప్పలపడేది. ఇగ ఇప్పుడు రంది లేదు. పెట్టుబడికి సర్కారోళ్లే పైసలిస్తన్రు. రైతు బంధు పైసలు జమ చేసుకొని నా పొలంలో బాయి తవ్వించుకున్న. పైప్‌లైన్ కూడా వేసుకున్న. కరెంటు కోసం రైతు బంధు పైసలతో ఇటీవల డీడీ కట్టిన. ఈసారి కూరగాయాలు సాగు చేస్తున్న.