
వివిధ ప్రాంతాల నుంచి వలస వస్తున్న పిట్టలు
250 జాతులకు నిలయంగా అడవులు
నేడు, రేపు బర్డ్‌వాక్ ఫెస్టివల్
తరలిరానున్న పక్షి ప్రేమికులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ);కాగజ్‌నగర్ అడవులు వలస పక్షులకు ఆశ్రయమిస్తున్నాయి. ఏటా శీతాకాలంలో దేశ విదేశాల నుంచి వందల జాతులు తరలివచ్చి కనువిందు చేసున్నాయి. నీటి వనరుల వద్ద వాలుతూ కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో 250 రకాలు ఉన్నట్లు అటవీశాఖ గుర్తించగా, ఇటీవల కొత్తరకం జాతులు సైతం దర్శనమిచ్చాయి. శని, ఆదివారాల్లో బర్డ్‌వాక్ ఫెస్టివల్ నిర్వహించనుండగా, పరిశోధకులు అధ్యయనానికి వస్తున్నారు.
నేడు, రేపు బర్డ్‌వాక్ ఫెస్టివల్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : అడవుల జిల్లాగా పేరొందిన ఆసిఫాబాద్.. వన్యప్రాణులకే కాదు.. అరుదైన పక్షులకూ నిలయంగా మారింది. వందలాది పక్షి జాతులకు నిలయంగా మారిన కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం భవిష్యత్‌లో మరింత ప్రాచుర్యం పొందనున్నది. ఏటా శీతాకాలం సీజన్లో ఇక్కడికి వచ్చే అరుదైన పక్షులు కిలకిల రావాలతో సందడి చేస్తుంటాయి.
వందలాది పక్షి జాతులు..
జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం సుమారు 893 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. ఈ అడవులు వన్య ప్రాణులతో పాటు పులులకు కూడా సురక్షితమైన ఆవాస ప్రాంతాలుగా మారాయి. ఇక్కడి అడవుల్లో ఉండే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వందలాది పక్షి జంతు జాతులు నివసిస్తున్నాయి. ప్రధానంగా ఈ అడవుల్లో అరుదైన పక్షిజాతులకు పెట్టింది పేరు. అధికారులు ఎన్ని పక్షులను గుర్తిస్తున్నప్పటికీ కొత్త పక్షులు దర్శనమిస్తూనే ఉన్నాయి. అటవీ అధికారులు కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంతో గతంలో 250 రకాల పక్షిజాతులను గుర్తించారు.
అరుదైన పక్షులు.. పరిరక్షణకు చర్యలు..
కాగజ్‌నగర్ అడవుల్లో కొత్తగా అటవీ అధికారుల కెమెరాలకు గత ఏడాది చిక్కిన అరుదైన పక్షులు నూతటెక్స్, శిక్రా, కామన్ కింగ్ ఫిపర్, బ్రహ్మణ్ డక్, హౌక్ ఈగల్, స్పాట్ బాయిల్డ్ డక్, స్యాండ్ పైపర్, రెడ్ మునియా, స్ట్రాబెర్రీ పించ్, వాటర్ హెన్, ఓస్పె, గ్రే హెడెడ్ ఫిష్ పక్షులు గుర్తించారు. ఒకే జాతి పక్షుల్లోనే వివిధ రకాలు ఉండడం విశేషం. లకుముకి (కింగ్ ఫిషర్ ) పిట్టల్లో మూడు రకాలున్నాయి. దాసరి పిల్ల (గాగటైల్)లో పసుపు, నారింజ రకాలు ఉన్నాయి. బదురు స్వర్ణగిజిగాడు ఉండడం విశేషం. వీటితో పాటు గ్రీన్బీ ఇటర్, పావురాల్లో యూరోషియన్, లాఫింగ్ స్పాంటెడ్ లాంటి మూడు రకాలు ఉండడం విశేషం. కాగజ్‌నగర్ అడవుల్లోని పక్షులను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లో పక్షిజాతులు ఆవాసం ఉండే ప్రాంతాలకు ఎవరినీ అనుమతించరు. నీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పక్షుల కనువిందు..
ఈ సీజన్లో వలస వచ్చిన పక్షులు సందడి చేస్తున్నాయి. రంగు రంగులతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త జాతి పక్షులు ఇక్కడకు రావడంతో పలువురు పక్షి ప్రేమికులు వాటిని వీక్షించి.. సెల్ఫోన్లలో బంధిస్తున్నారు. శీతాకాలంలో మాత్రమే వివిధ ప్రాంతాల నుంచి ఈ పక్షులు మన ప్రాంతాలకు వలస వస్తాయి, మళ్లీ కొద్ది రోజుల్లో తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోతాయని అటవీ అధికారులు తెలుపుతున్నారు. వీటికి ఎలాంటి ముప్పు కలుగకుండా వలస వచ్చిన పక్షులను పర్యవేక్షిస్తున్నారు.
నేడు, రేపు బర్డ్‌వాక్ ఫెస్టివల్..
జిల్లా అడవుల్లోని పక్షిజాతులపై అధ్యయనం చేసేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పక్షి ప్రేమికులు, పరిశోధకులతో ప్రత్యేకంగా ఈ నెల 8, 9 తేదీల్లో బర్డ్ వాక్‌ను నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్ డివిజన్లోని బెజ్జూర్, కౌటాల, కాగజ్‌నగర్, పెంచికల్పేట్ అటవీ రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో పరిశోధన చేయనున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న పక్షుల ప్రత్యేకతలను గుర్తించనున్నారు. కాగజ్‌నగర్ అడవుల్లోని పక్షి సంపదపై జరుగనున్న ఈ అధ్యయనంతో జిల్లాకు మంచి గుర్తింపు రానుంది.