
ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ నిర్మల్‌టౌన్, నవంబర్ 6 : వానకాలం సీజన్లో పండించిన పత్తి రైతన్నకు సిరులు కురిపిస్తున్నది. వర్షాలతో కొంత దిగుబడి తగ్గినా, చేతికందిన మిగతా పంటకు ధర రోజురోజుకూ పెరుగుతుండడం ఊరటనిస్తున్నది. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు రూ. 2వేలకు పైగానే అధికంగా చెల్లిస్తుండడం సంతోషాన్నిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో జిల్లా పత్తికి మంచి నాణ్యత ఉంటుందనే గుర్తింపు ఉండడం ఇందుకు కారణమవుతున్నది. మరికొన్ని గ్రామాల్లో ఇంటి వద్దే పంటను కొంటుండగా,దళారులు, కమీషన్ ఏజెంట్లకు చేతినిండా పనిదొరుకుతున్నది. రైతాంగం మురిసిపోతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట రికార్డు ధర పలుకుతోంది. పత్తి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ. 6025 ఉండగా, ప్రస్తుతం రూ.8530 చొప్పున ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెల్లబంగారం అధిక ధర పలకడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. కొందరు రైతులు ఇప్పటికే పత్తిని అమ్ముకోగా, మరికొందరు ధర పెరుగుతుందని వేచి చూస్తున్నారు. పలు గ్రామాల్లో మహారాష్ట్ర వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించి రైతుల నుంచి పంటను సేకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం సీజన్లో పత్తి పంట వేస్తారు. రైతులు పత్తి పంట సాగుకు బీటీ విత్తనాలను ఉపయోగిస్తారు. పంట వేసినప్పటి నుంచి ఏ విత్తనం కొనాలనే విషయంలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పరిగణలోకి తీసుకుంటా రు. కాయ బరువు ఎక్కువ ఉన్నవి, గత సాగు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పంటలు వే స్తారు. ఎక్కువ దిగుబడులు సాధించడానికి మొ క్కల సాంద్రతను పెంచుకునే రకాలను వినియోగిస్తున్నారు. జూన్ మొదటి, రెండో వారంలో పంటను వేయ గా అక్టోబర్ మొదటి వారంలో దిగుబడులు ప్రారంభమవుతాయి. జిల్లాలో నేల స్వభావం, పంటకు అనుకూలమైన వాతావర ణం, అధిక వర్షపాతం లాంటి కారణంతో ఇక్కడి పత్తి ఆసియాలోనే నాణ్యమైనదిగా పేరుంది. జిల్లాలో సాగయ్యే పత్తికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. పింజ పొడవు ఎక్కువగా ఉండడంతో పాటు దారం పొడవు ఎక్కువగా వచ్చి నాణ్యతగా ఉంటుంది. దూది కూడా తెల్లగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఫలితంగా వ్యాపారులు ఆదిలాబాద్‌లో సాగు చేసే పత్తిని కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు.
పలుచోట్ల ఇంటికొచ్చి బేరం ఆడి…
పత్తిని పండించిన రైతులకు ఈసారి ధర కలిసి వచ్చింది. గతంలో పత్తిని విక్రయించేందుకు రైతులు సీసీఐ, ప్రైవేటు జిన్నింగ్ మిల్లులకు వాహనాలు, ఎడ్లబండ్ల ద్వారా తరలించేవారు. అక్కడ వ్యాపారి నిర్ణయించిందే ధర. తేమ, ఇతర కారణాలు చెప్పి క్వింటాలుకు 2 నుంచి 4 కిలోల వరకు కటింగ్ చేసేవారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఇచ్చోడ, సొనాల, కుభీర్, సారంగాపూర్, జైనూర్, వాంకిడి తదితర ప్రాంతాల్లో జిన్నింగ్ వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని గ్రామాలకు వచ్చి పత్తిని కొనేందుకు బేరం ఆడుతున్నారు. ఏ రైతు ఎంత పత్తి పంట సాగు చేశారు.. వచ్చిన దిగుబడిని తమ ఏజెంట్ల ద్వారా తెలుసుకొని తమకే పత్తిని విక్రయించాలంటూ రైతు ఇంటికొచ్చి బేరం ఆడుతున్నారు. గ్రామాల్లోనే క్వింటాల్ పత్తికి రూ.8,400- రూ.8,700 వరకు కొనుగోలు చేస్తున్నారు. చాలా గ్రామాల్లో దళారులు ఇంటింటికీ తిరుగుతూ పత్తిని కొనుగోలు చేస్తుండడంతో రైతుల ఇంటికే సంపత్తి వచ్చినట్లవుతున్నది. డబ్బులు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే అడ్వాన్స్ చెల్లింపులు చేస్తూ పత్తి పంట మాత్రం తమకే విక్రయించాలని ఒప్పందం చేసుకుంటున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. దీనివల్ల రైతులకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగులుతున్నాయి.
10.18 లక్షల ఎకరాల్లో సాగు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానకాలంలో 10.18 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఈ సీజన్లో 62 లక్షల క్వింటాళ్ల పంట విక్రయానికి రానున్నట్లు అధికారులు అంచ నా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 3.90 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి వేయగా 27 లక్షల క్వింటా ళ్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3.23 లక్షల ఎకరాల్లో వేయగా, 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నిర్మల్ జిల్లాలో 1.35 లక్షల ఎకరాలకు 8 లక్షల క్వింటాళ్లు మంచిర్యాల జిల్లాలో 1.70 లక్షల ఎకరాలకు 14 లక్షల క్వింటాళ్లు పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
రికార్డు స్థాయిలో ధర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతేడాది పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.5825 ఉండగా ప్రభుత్వం ఈ సారి రూ.200 పెంచి క్వింటాలుకు రూ. 6025 ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో మద్దతు ధరతో అధికారులు పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లు ఒక్కో దాని ధర రూ. 60వేలు ఉండడంతో వ్యాపారులు పోటీ పడి మద్దతు ధర కంటే ఎక్కువ కు పంటను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పత్తి క్వింటాలుకు రూ.8530 ఉండగా, మద్దతు ధర కంటే రూ. 2505 అధికంగా ప్రైవేటు వ్యాపారులు ఇస్తున్నారు.
కమీషన్ ఏజెంట్లకు చేతినిండా పని..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి వ్యాపారుల్లో కమీషన్ ఏజెంట్లకు ఈసారి చేతినిండా పని దొరికింది. నిర్మల్, భైంసా, ఖానాపూర్, బోథ్, సొనాల, ఇచ్చోడ, నార్నూర్, ఆదిలాబాద్, బేల, తదితర ప్రాంతాల్లో కమీషన్ ఏజెంట్లు గ్రామాల్లోకి వచ్చి కమీషన్ పద్ధతిలో పత్తిని కొనుగోలు చేసి బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేటులోనే పత్తికి రూ.8,500 నుంచి రూ.8,700వరకు ధర పలుకుతుండగా..మహారాష్ట్రలో రూ.9వేలు, ఖమ్మం, వరంగల్ మార్కె ట్లో రూ.9.400 వరకు ధర లభిస్తున్నది. ఇక్కడ రైతుల నుంచి నేరుగా పత్తి కొనుగోళ్లు చేస్తున్న కమీషన్ ఏజెంట్లు ఆ గ్రామాల్లోనే లారీల్లో నింపి అక్కడి మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీనివల్ల క్వింటాల్‌కు రూ.800-రూ.వెయ్యి వరకు అదనంగా వస్తున్నది. గతంలో భైంసా, ఆదిలాబాద్ మార్కెట్లకు గుంటూరు, ఖమ్మం, మహిబూబ్నగర్, తదితర ప్రాంతాల్లో అక్కడ కొనుగోలు చేసి ఇక్కడికి తరలించే ఏజెంట్లు ఇప్పుడు ఇక్కడి పత్తిని ఎక్కడ ధర ఉంటే అక్కడికి తరలిస్తున్నారు. దీంతో పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోగా.. స్థానికంగానే పత్తిని విక్రయించడం వల్ల సమయం కూడా ఆదా అవుతున్నట్లు తెలిపారు. అయితే ఏజెంట్లు కొనుగోలు చేసిన పత్తిని మార్కెట్లో విక్రయించాలంటే రైతుల పేరు మీదనే మళ్లీ విక్రయించుకునేందుకు వారి పట్టా పాసుపుస్తకం, ఆధార్‌కార్డు వివరాలను కూడా తమవద్దనే ఉంచుకుంటున్నారు.