
బోథ్, నవంబర్ 6: మండలంలోని బాబెరలో శనివారం దండారీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డప్పుల చప్పుళ్ల నడుమ గుస్సాడీలు నృత్యాలు చేస్తూ కనువిందు చేశారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని, వాటిని కొనసాగిస్తూ భావి తరాలకు అందించాలని ఎంపీడీవో సీహెచ్ రాధ అన్నారు. అనంతరం ఆదివాసీ మహిళలతో కలిసి ఎంపీడీవో నృత్యం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సెడ్మకి సురేశ్, విజయలక్ష్మి, సుశీల, గ్రామ పటేల్, దేవరి, మహిళలు, గుస్సాడీలు పాల్గొన్నారు.
పార్డీ (కే)లో కోలాబోడి పూజలు
పార్డీ (కే) గ్రామంలో గిరిజనులు శనివారం కోలాబోడి పూజలు నిర్వహించారు. పది రోజుల పాటు నిర్వహించిన గుస్సాడీ, దండారీ ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామ పటేల్ ఇంటి ముందు కోలాబోడి దేవతలకు పూజలు చేశారు. మహిళలు నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గుస్సాడీలకు స్నానం చేయించడంతో ఉత్సవాలను ముగించారు. ఐటీడీఏ డైరెక్టర్ మెస్రం భూమన్న, గ్రామ పటేల్ సిడాం అమృత్రావ్, దేవరి ఆత్రం జైతు, మెస్రం మదన్, పురుషోత్తం, హన్మంతు, గంగారాం పాల్గొన్నారు.
సిరికొండ,నవంబర్6: ఆదివాసీ సంప్రదాయాలను కాపాడుకోవాలని రాయిగూడ సర్పంచ్ జుగ్నాక్ లక్ష్మి సూచిం చారు. మండలంలోని రాయిగూడలో ఆదివాసులు శనివారం దండారీ వేడుకలు నిర్వహించారు. గుస్సాడీలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గుస్సాడీ పండుగను గుర్తించి రూ.10వేలు అందించిందని తెలిపారు. కార్యదర్శి అరుణ్, సుంకిడి కార్యదర్శి నీతూ, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, నవంబర్ 6 : మండలంలోని కోకస్మన్నూర్లో శనివారం గాజిలి గ్రామానికి చెందిన గుస్సాడీల నృత్యాలు అలరించాయి. డప్పు చప్పుళ్లతో ఇంటింటికి వెళ్లి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఇనామ్లు (కానుకలు) స్వీకరించారు. గుస్సాడీల నృత్యాలను గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.