
ఉట్నూర్ రూరల్, నవంబర్ 6: పంటల్లో సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్, రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెక్పోస్ట్ కొత్తగూడెంలో వరి, పత్తి, కంది పంటలను శనివారం పరిశీలించారు. కొత్తగూడెం గ్రామానికి చెందిన పరుశురాం సాగుచేసిన వరి పంటలో మెడవిరుపు వ్యాధి సోకడంతో పంటకు పూర్తిగా నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. వ్యవసాయాధికారి సూచనల మేరకు తగిన మందులు పిచికారీ చేస్తే పంటను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ తెగులు నివారణకు కాసుగామైసిన్ 2గ్రాములు లేదా ట్రైసైక్లోజోల్ 0.6గ్రాములు లేదా ఐసోప్రోపో తయోలిన్ 1.5మీల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలన్నారు. సుమారు 6 ఎకరాల్లో వరి సాగు చేయగా పంట పూర్తిగా దెబ్బతిని రూ. 3 లక్షల వరకు నష్టపోయానని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఆదుకోవాలని కోరాడు. అనంతరం పత్తి, కంది పంటలను పరిశీలించారు. పత్తి పంటలో ప్రస్తుతం ఆశిస్తున్న గులాబీ రంగు పురుగు, అంతర్గత కాయకుళ్లు తెగులు సోకుతుంద న్నారు. దీని నివారణకు సైపర్మేత్రిన్ లేదా ఫెన్వలరేట్ 1 మిల్లి లీటరు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రాములు, ప్లాంటామైసిన్ 1గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కంది పంటలో ప్రస్తుత దశలో ఆకు గూడు పురుగు, మరుక మచ్చల పురుగులు ఆశిస్తున్నాయని తెలిపారు. వీటి నివారణకు 200 లీటర్ల నీటిలో స్పైనోసాడ్ 60 మిల్లి లీటర్లు లేదా క్లోరాన్ట్రానిలిప్రోల్ 60 మిల్లి లీటర్లు లేదా ప్లూబెంజోయేట్ 40 మిల్లి లీటర్లు లేదా ఏమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఏదోఒకటి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో రాథోడ్ గణేశ్, సర్పంచ్ ఆత్రం రాహుల్, ఏఈవోలు శ్వేత, జయశ్రీ, రైతు కామెరి పోశన్న ఉన్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్6 : మండలంలో రైతులు సాగు చేసిన పత్తి శనగ, కంది పంటలను వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేతలు శ్రీధర్ చౌహాన్, రాజశేఖర్ శనివారం పరిశీలించారు. శనగ పంటలో విత్తన శుద్ధికి కార్బండిజమ్ 2.5 కిలోలు కలిపి శుద్ధి చేయాలన్నారు. కంది పంట లో పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈవో మల్లేశ్, రైతులు పాల్గొన్నారు.