
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 6: పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్తీక దీపోత్సవం కనుల పండువగా సాగింది. హాజరైన మహిళలకు ఉచితంగా పూజాసామగ్రిని పంపిణీ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య సుమారు 2వేల మంది మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. దీంతో డైట్ కళాశాల ప్రాంగణమంతా దీపాలతో దేదీప్యమానంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ పరమశివుని దయతో ప్రజలంతా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
త్వరలో పోడు భూములకు పట్టాలు
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 6: త్వరలోనే పోడు భూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని కొత్తూర్, లింగుగూడ, దార్లొద్ది, సాలెగూడ, కొలామ్తిప్ప తదితర గ్రామాల్లో శనివారం నిర్వహించిన దండారీ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని, గుస్సాడీ టోపీ ధరించి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు దరిచేరుతున్నాయన్నారు. దండారీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు గూడేనికి రూ.10వేల చొప్పున పంపిణీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సెవ్వ జగదీశ్, సోనేరావ్, కనక రమణ, జంగు పటేల్ తదితరులు పాల్గొన్నారు.