
పక్షం రోజులుగా కురుస్తున్న వానలతో తీవ్ర నష్టం
చేలలోనే రాలుతున్న పూత, కాయలు
పై నుంచి పోషకాలు అందించాలి.. :వ్యవసాయాధికారులు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో రోజూ కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. పదిహేను రోజుల ముందు వరకు కూడా వాతావరణం అనుకూలించడం, వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో పంట బాగున్నది. ఈ పక్షం రోజులుగా అతి నుంచి భారీ వర్షాలు కురవడం, సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవడంతో చెట్లకు పోషకాలు అందడం లేదు. ఫలితంగా పూత, కాయలు రాలిపోతున్నాయి. పంట నష్టపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పత్తి చెట్లకు పోషకాలను నేరుగా అందించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు.
వానకాలంలో రైతులు అధికంగా పంటలు వేస్తారు. ఈ సీజన్లో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 5.72 లక్షల ఎకరాలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేయగా.. ఇందులో పత్తి 4.34 లక్షల ఎకరాలు సాగు అయింది. గతేడాది కూడా పత్తి దిగుబడులు ఆశాజనకంగా రావడంతో కనీస మద్దతు ధర కూడా రూ.5,825 చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ యేడాది రూ.200 పెంచి రూ.6,025 ఇస్తామని ప్రకటించింది. దీంతో ఈ యేడాది కూడా పత్తి విస్తీర్ణం పెరుగగా.. అదేస్థాయిలో దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. జూన్లో పత్తి విత్తనాలు విత్తగా.. సీజన్ ప్రారంభం నుంచి పక్షం రోజుల వరకు వర్షాలు సమృద్ధిగా పడడంతో పంట ఏపుగా పెరిగి పూత, కాతకు వచ్చింది. యేటా అక్టోబర్ మొదటి వారంలో దిగుబడులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం పక్షం రోజుల నుంచి పడుతున్న వానలతో దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలతో పోషకాల లోపం
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో 902.1 మిల్లీమీటర్లు నమోదుకావాల్సి ఉండగా.. 1,257.3 మిల్లీమీటర్లు కురిసింది. పక్షం రోజుల నుంచి క్రమంగా పడుతున్న వర్షం కారణంగా పత్తి పంటకు పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం పూత, కాయ దశలో ఉండగా చెట్లకు పోషకాలు అధికంగా అవసరమవుతాయి. వర్షాల కారణంగా చెట్లకు భూమి లో నుంచి పోషకాలు తీసుకోలేని పరిస్థితి ఉండడంతో పూత, కాయలు రాలిపోతున్నాయి. చేలలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో చెట్లు కుళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానలు ఇలాగే పడితే అధిక నష్టం సంభవిస్తుందని వ్య వసాయశాఖ అధికారులు అంటున్నారు. రైతులు పంటకు నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పంట పొలాల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా చూడడంతోపాటు పత్తి చెట్లకు పోషకాలను పైనుంచి నేరుగా అందించాలని కోరుతున్నారు. ఎన్పీకే, యూరియా ద్రావణాన్ని చెట్లపై చల్లితే పోషకాలు లభించి.. పంట నష్టం జరిగే అవకాశాలు ఉండవని సూచిస్తున్నారు.
పోషకాలు పైనుంచి అందించాలి..
ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. 15 రోజుల నుంచి కురుస్తోన్న వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. పత్తి చెట్లకు పోషకాలను పైనుంచి అందించాలి. దీంతో పంటలో పూత, కాయలు రాలడం నివారించవచ్చు. పంట నష్టం జరుగకుండా వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
-శివకుమార్, వ్యవసాయాధికారి, టెక్నికల్, జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం
వర్షాలతో పత్తి పంటకు నష్టం
రోజు పడుతున్న వానలతో పత్తి పంటకు నష్టం జరుగుతుంది. ఇన్ని రోజుల వరకు పంట మంచిగా ఉంది. వానలు లేకుంటే ఒక్కో చెట్టుకు 50 కాయలు వచ్చేవి. వానతో పూత, వచ్చిన కాయలు కూడా రాలిపోతున్నాయి. పంట దిగుబడి బాగా వస్తుందనుకున్నాం. వర్షం కారణంగా పంట దిగుబడి బాగా తగ్గుతుంది. ఇంకొన్ని రోజులు వర్షం పడితే పంట పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది.