
సోన్, డిసెంబర్ 5 : ‘స్వామియే అయ్యప్ప.. శరణం శరణం అయ్యప్ప..’ అంటూ ఆ ప్రాంతమంతా మార్మోగింది. సోన్ మండలం కడ్తాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఆదివారం నిర్వహించిన ఆరట్టు ఉత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవాలు నిర్వహించగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, మహారాష్ట్రకు చెందిన అయ్యప్ప దీక్షాపరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయం లో పలు పూజలు నిర్వహించారు. కడ్తాల్ నుంచి ప్రారంభమైన పల్లకీ సేవ గంజాల్,సోన్ మీదుగా గోదావరి వరకు సాగింది. అక్కడ జలాభిషేకం అనంతరం తిరిగి అయ్యప్ప ఆలయానికి స్వామివారిని తీసుకొచ్చారు. భక్తుల నృత్యాలు, పాటలు, అయ్యప్ప నామస్మరణతో ఆలయం మార్మోగింది. గోదావరిలో అయ్యప్ప స్వామికి నది జలం, పంచామృతంతో అభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌఠ (బీ) గ్రామానికి చెందిన గురుస్వామి ప్రభాకర్‌రెడ్డి, మంచిర్యాల గుడిపేట బెటాలియన్ డీఎస్పీ చౌహాన్ రఘునాథ్ అలపించిన గేయాలు భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. అనంతరం భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు.
బాసరలో అయ్యప్ప మహా పడిపూజ
బాసర, డిసెంబరు 5 : బాసరలో ఆదివారం గురుస్వామి జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. 18 మెట్లను పూలతో అలంకరించి దీపాలు వెలిగించారు. అయ్యప్ప స్వామికి అభిషేకం చేశారు. అనంతరం దీక్షాపరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. సర్పంచ్ లక్ష్మణ్‌రావు, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు, నాయకులు, ఉన్నారు.