
కడెం, నవంబర్ 5: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల హాజరుశాతాన్ని పెంచాలని నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కడెం జడ్పీ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్ధులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్ధులు పదిలో మంచి ఫలితాలు సాధించాలని, పాఠశాలలో రోజువారీ పరీక్షలను పూర్తి సన్నద్ధతతో రాయాలని సూచించారు. అనంతరం విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్ధుల హాజరుశాతాన్ని పెంచి పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. బోధనలో సృజనాత్మకను ప్రదర్శించి విద్యార్ధులను ఆకట్టుకోవాలన్నారు. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు మాధవ్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులున్నారు.
ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
పెంబి, నవంబర్ 5: ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచాలని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెంబి, మందపల్లి, కోశగుట్ట గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలువేసి సమాధానాలు రాబట్టారు. మందపల్లిలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న కేజీబీవీలో గదుల కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనం పూర్తయ్యే వరకు అనుకూలమైన భవనంలోకి మార్చడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింహాచారి, వెంకటరాములు, సీఆర్పీ విఠల్ ఉన్నారు.