
ఎదులాపురం, నవంబర్ 5 : ప్రతీ హాబిటేషన్‌కు ఎఫ్ఆర్సీ టీంను ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పోడు భూముల క్లెయిమ్స్‌కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన పనులపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ హక్కు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చట్ట ప్రకారం పోడు భూములు సాగుచేస్తున్న వారికి హక్కు పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వ ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి గ్రామానికీ అటవీ హక్కుల కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. శనివారం లోగా కమిటీ ఏర్పాటు పూర్తిచేయాలని ఆదేశించారు. అర్జీదారు సమర్పించే ఫారం-ఏ లను సరఫరా చేస్తామని తెలిపారు. నిబంధనల మేరకు అటవీ హక్కుల కమిటీల్లో సంబంధిత సభ్యులు, మహిళలు ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా పోడు వ్యవసాయం చేస్తున్న హాబిటేషన్ల కమిటీల ఏర్పాట్లపై సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాజేశ్వర్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.