
కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 5: సింగరేణి సంస్థ వచ్చే ఏడాదికి నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలంటే కొత్త ఓసీ గనులను సకాలంలో ప్రారంభించాల్సిన అవసరం ఉందని సీఎండీ శ్రీధర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, ఏరియాల జీఎంలతో శుక్రవారం పత్యేక సమావేశం నిర్వహించారు. కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించారు. కొత్త గనుల సన్నాహాలను ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది చివరలో ఉత్పత్తిని ప్రారంభించనున్న జీడీకే ఓసీపీ, ఒడిస్సాలోని నైనీ బొగ్గు బ్లాక్, ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలతో జేవీఆర్ ఓపెన్ కాస్ట్ 2తో పాటు 2022-23లో మరో 5 ఓపెన్ కాస్టు గనులను సింగరేణి సంస్థ ప్రారంభించాలని నిర్ణయించిందని చెప్పారు. వీటిలో కొత్తగూడెం ఏరియా వీకే ఓసీపీ, రామగుండం ఏరియాలోని ఆర్జీ ఓసీ గని, బెల్లంపల్లిలోని గోలేటి, ఎంవీకే ఓపెన్ కాస్ట్ గని, ఇల్లెందు ఏరియాలో రొంపెడు ఓసీ గనులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ గనుల నుంచి సుమారు తొలి ఏడాది 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని కంపెనీ నిర్ణయించిందన్నారు. కొత్త గనులకు సంబంధించిన అంశాలపైన కూలంకశంగా చర్చించారు. మిగిలిన అనుమతులు, భూ సేకరణ, ఆర్అండ్ఆర్ సమస్యలు పరిష్కరించుకోవాలని, గనులకు కావాల్సిన యంత్రాల కొనుగోలు, ఓవర్ బర్డెన్ తదితర పనులకు కాంట్రాక్టు ఏజెన్సీల నియామకం లాంటివి పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణ, అడ్వైజర్లు డీఎన్ ప్రసాద్, సురేంద్ర పాండే, ఈడీ జే.ఆల్విన్, జీఎంలు సూర్యనారాయణ, నాగభూషణ్‌రెడ్డి, పీ సత్తయ్య, సురేందర్ పాల్గొన్నారు.