
ఆకట్టుకుంటున్న గ్రామీణ పార్కులు
కట్టిపడేస్తున్న పచ్చందాలు
చిన్నారులకు ఆటవిడుపు.. పెద్దలకు కాలక్షేపం
సేదతీరేందుకు బెంచీలు, షెడ్లు
నార్నూర్ / ఇంద్రవెల్లి, డిసెంబర్ 3: పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. గ్రామపంచాయతీకి ప్రభుత్వం నెలనెలా మంజూరు చేస్తున్న ప్రత్యేక నిధులతో గ్రామాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నది. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి అన్ని రకాల మొక్కలు నాటి పెంచుతున్నది. దీంతో హరిత అందాలు పరవశింపజేస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జాడ కనిపించలేదు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో సకల సౌకర్యాలతో విలసిల్లుతున్నాయి. పల్లె ప్రకృతి వనాల్లో ఏపుగా పెరిగిన చెట్లతో గ్రామాల్లో పచ్చని అందాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి సోయగంతో పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదభరితంగా మారాయి. ఎటుచూసినా పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. పూల, వివిధ రకాల మొక్కలు కట్టిపడేస్తున్నాయి. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన వస్తువులతో ఆటలు ఆడుకుంటున్నారు. చిన్నాపెద్ద సేద తీరేందుకు నిర్మించిన బెంచీలు, షెడ్డుల్లో కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నార్నూర్‌లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ఉమ్మడి మండలాల గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్ ఈ ప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. పంచాయతీ నిధులతో వివిధ రకాల 3 వేల మొక్కలు పెంచుతున్నారు. ఇందులో రాజమండ్రి నుంచి 500 మొక్కలు తెప్పించి నాటారు. అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పిల్లల కోసం ఆట వస్తువులు, చిన్నాపెద్దలు సేదతీరేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. ముఖద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గ్రావెల్‌రోడ్డు ఏర్పాటు చేసి మొక్కలకు రంగులద్దారు. నిత్యం ఉదయం, సాయంత్రం చిన్నారులు, పెద్దలు ఇందులో కాలక్షేపం చేస్తున్నారు. సర్పంచ్‌ను జిల్లా, మండలశాఖ అధికారులు అభినందిస్తున్నారు.
ఆహ్లాద భరితం..ఇంద్రవెల్లి పల్లెప్రకృతి వనం
ఇంద్రవెల్లి గ్రామ సర్పంచ్ కోరెంగా గాంధారితోపాటు ఈవో శ్రీనివాస్, అధికారుల ప్రోత్సాహంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రెవెన్యూ, ఈజీఎస్ శాఖల అధికారుల సహకారంతో వారు ప్రభుత్వ భూమిని గుర్తించి ఎకరం స్థలంలో రూ.7.27 లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దారు. ఇందులో అన్ని రకాల సుమారు మూడు వేల మొక్కలు నాటి పెంచుతున్నారు. ప్రకృతి వనంలోని మొక్కలు చెట్లుగా ఎదగడంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. ప్రకృతివనానికి రూ.2 లక్షలతో ముఖద్వారాన్ని నిర్మించి, అందంగా తీర్చిదిద్దారు. నాటిన మొక్కల మధ్యలోంచి వెళ్లడానికి ప్రత్యేకంగా దారులను నిర్మించారు. వాటికి ఇరువైపులా రంగురంగుల మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా వాచ్‌మన్‌ను నియమించి నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు.
ప్రకృతి వనాన్ని మరింత అభివృద్ధి చేస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీకి మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన ప్రకృతి వనంలో మూడు వేల మొక్కలు నాటి పెంచుతున్నాం. పల్లె ప్రకృతి వనాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. కొత్తగా నర్సరీని ఏర్పాటు చేసి అందులో అన్ని రకాల మొక్కలు పెంచుతాం. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేస్తున్నాం. తడి, పొడి చెత్త తరలించేందుకు ప్రత్యేకంగా మూడు ట్రాలీ వాహనాలను కొనుగోలు చేశాం. ఆ వాహనాలను పంపించి ఇండ్ల నుంచి చెత్తను డంప్ యార్డుకు తరలిస్తున్నాం.