
ఎదులాపురం, నవంబర్3: గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించాలని, అర్హులందరికీ లబ్థి చేకూరేలా కమిటీలు పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులు, వీఆర్ఏలతో అటవీ హక్కుల కమిటీల ఏర్పాటు, తదితర అంశాలపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోడు భూములపై ప్రభుత్వ నిర్ణయం, చట్ట ప్రకారం అర్హులకు అటవీ భూముల హక్కులను కల్పించేందుకు నిబంధనల మేరకు ఫారెస్ట్ రైట్స్ కమిటీలను గ్రామస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ఆ కమిటీలు గ్రామాల్లోని ప్రజలకు అటవీ హక్కులపై విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అర్హతున్న వారికి భూముల యాజమాన్య హక్కు చెందేలా సాగు చేస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం, పూర్వాపరాలు, పత్రాలను పరిశీలించి డివిజనల్ స్థాయి కమిటీకి పంపించాలని, తద్వారా డివిజనల్ స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా స్థాయి కమిటీకి సిఫారసు చేస్తారని తెలిపారు. తుది నిర్ణయం జిల్లా స్థాయి కమిటీకి మాత్రమే ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా, సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో 345 గ్రామస్థాయి సూపర్వైజర్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ టీమ్‌లో పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ సహాయకులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. ఫారెస్ట్ రైట్స్ కమిటీలో పది నుంచి 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏజెన్సీలో వందశాతం షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వారుంటారని, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో 2/3 ఎస్టీలు ఉంటారని, ఈ కమిటీలో 1/3 మహిళా సభ్యులుండాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 728 గ్రామాల్లో 56,140 ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉందని తెలిపారు. గ్రామస్థాయి సూపర్వైజర్ టీమ్‌లు ఈ నెల 5 నుంచి షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లోకి వెళ్లి ఫారెస్ట్ రైట్స్ కమిటీపై అవగాహన కల్పిస్తూ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం నవంబర్ 8 నుంచి క్లెయిమ్‌లను స్వీకరించడం, సర్వే చేయించడం జరగాలని, క్లెయిమ్‌లను పరిశీలించి సబ్ డివిజనల్ స్థాయి కమిటీలను పంపించాలన్నారు.
ఫారెస్ట్ రైట్స్ కమిటీ సమావేశం మినిట్స్ రికార్డు చేయాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ.. 13 డిసెంబర్ 2005 కు ముందు సాగు చేస్తున్న వారు చట్టప్రకారం అర్హులన్నారు. ఫారెస్ట్ రైట్స్ కమిటీలో చదువుకున్న వారిని తీసుకోవాలని సూచించారు. గ్రామసభ నిర్వహించడంలో 50 శాతం కోరం ఉండాలని తెలిపారు. ప్రతి మండల టీమ్ మూడుసార్లు గ్రామాలను పర్యటించాలని సూచించారు. క్లెయిమ్‌లు తీసుకునే ముందు సంబంధిత డాక్యుమెంట్లు జతపరిచేలా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పదెకరాలకు మాత్రమే అర్హులని తెలిపారు. జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ.. 2005 డిసెంబర్ 13కు ముందు షెడ్యూల్డ్ తెగల వారు సాగు చేస్తూ ఉండాలని, గిరిజనేతరులు 2005 నాటికి ముందు 75 సంవత్సరాలు ఆ భూములు సాగు చేస్తున్నట్లు పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అవసరమైన పత్రాలు రిజిస్టర్లు, ఆయా టీమ్‌లకు సమకూర్చనున్నట్లు తెలిపారు. వీసీలో ఆర్డీవో రాజేశ్వర్, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.