
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
వారోత్సవాల్లో పాల్గొన్న రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు
ఎడ్లబండ్లతో ర్యాలీలు.. మార్మోగిన జై కేసీఆర్ నినాదాలు
మంచిర్యాల, జనవరి 3(నమస్తే తెలంగాణ);రైతుబంధు వారోత్సవాలు తొలిరోజు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో.. రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహిం చగా, ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్’ నినాదాలు మార్మోగాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే), నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని డోడర్న, మాలేగావ్.. తానూర్ మండల కేంద్రంలో.. మంచిర్యాల జిల్లా చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వేడుకలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నది. 2018లో ప్రారంభం కాగా.. యాసంగి సీజన్‌కు గాను ఎనిమిదో విడుత అందిస్తున్నది. ఈ నెల పదో తేదీ వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. అప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 వేల కోట్ల పెట్టుబడి సాయం అందుతుంది. ఎనిమిదో విడుత సాయం ఈ నెల 28న ప్రారంభం కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3వ తేదీ(సోమవారం) వరకు 4,88,805 మందికి రూ.544 కోట్లు అవుతాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 1,16,321 మంది లబ్ధిదారులకు రూ.162.44 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 92,068 మందికి రూ.108.28 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 1,26,772 మందికి రూ.114.99 కోట్లు, నిర్మల్ జిల్లాలో 1,53,644 మందికి రూ.158.22 కోట్లు జమయ్యాయి. దీంతో ఆయా రైతుల్లో సంతోషాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పులుంటే పంట పండది..
కుభీర్, జనవరి 3: బాకీలుంటే పంట పండదని మా పెద్దలు చెబుతుండే. మా కుటుంబానికి ఐదెకరాల 20 గుంటల సాగు భూమి ఉంది. ఇందులో నాలుగెకరాలు నాపేరిట ఉంది. గతంల పెట్టుబడి పైసల్లేక చాన ఇబ్బందులు పడ్డ. ఏనాడైతే సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10వేలు సాయం అందించడం మొదలు పెట్టిన్రో.. ఆనాటి నుంచి అప్పులు లేకుండయినయ్. పెద్ద రంది పోయింది. నా భూమికి పెట్టుబడి సాయం కింద సీజన్‌కు రూ.20వేలు వస్తున్నయ్. ఇగ ఎవుసానికి అప్పు చేయొద్దని నిర్ణయించుకున్న. పెట్టబడి కింద సర్కారోళ్లు ఇచ్చిన పైసలతోటే గింజలు, మందులు కొంటున్న. దిగుబడులు మంచిగ వస్తున్నయ్. ఈ యేడు వానకాలంలో పత్తి ఏసిన. కాని వర్షాల కారణంగా దిగుబడి తక్కువచ్చింది. మిగతా సోయా, కందితో మాత్రం లాభాలు మిగిలినయ్. ప్రస్తుతం సోయా తీసేసి మక్క, శనగ పంటలు పెట్టిన. గతంలో పెట్టుబడులు ఎల్లక ఎవుసం బంద్ చేసినోళ్లు కూడా ఇయ్యాల మళ్లీ పొలంబాట పట్టిన్రు. ఇయ్యాల 24 గంటల కరంట్ ఇస్తున్నడు కాబట్టే రైతుల రంది పోయింది. గతంల లెక్కుంటే రైతుల బతుకు ఆగం అయ్యేది. మొదటి మూడు విడుతల్లో వచ్చిన పైసలతో పొలం కాడికి కరంట్ తీగలు ఏయించిన. ఏ సమస్య లేకుంట చేసుకున్న. నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద బిడ్డ ఎనిమిదో తరగతి, రెండో బిడ్డ ఐదో తరగతి చదువుతున్నది. వారి సదువులకు నా ఎవుసమే ఆధారం. సర్కారు అన్ని సౌలతులు చేస్తున్నది కాబట్టే ఇయ్యాల ఎవుసం పండుగలా చేసుకుంటున్న.
-కత్తురోల్ల సాయినాథ్, రైతు, సాంగ్వి
ఎడ్లు కొని ఎవుసం చేస్తున్న..
నా పేరు ఆత్రం మాణిక్‌రావ్. మా నాయన ఆనంద్‌రావ్‌కు 9 ఎకరాల 20 గుంటల భూమి ఉండే. మేం నలుగురం అన్నదమ్ములం. నా పాలు కింద 2. ఎకరాల 30 గుంటల భూమి వచ్చింది. తెలంగాణ రాక ముందు జగిత్యాలల కూలీగా పని చేస్తూ బతికిన. భూముల పంపకాలు అయినంక సాగు చేద్దామంటే చేతిలో డబ్బులు లేకుండే. అందుకే ఉన్న భూమిని కౌలుకు ఇచ్చేసి కూలి పనికి పోయిన. తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం షురూ జేసిండు. అప్పటి నుంచి నాకు పెట్టుబడి సాయం కింద సీజన్‌కు రూ. 14 వేలు వస్తున్నయ్. దీంతో ఇగ ఎవుసం చేద్దామని మళ్లీ ఇంటికి వచ్చిన. మొదట్లో కిరాయి ఎడ్లతో సాగు మొదలువెట్టిన. రైతుబంధు డబ్బులతో పాటు బ్యాంక్ నుంచి పంట రుణం తీసుకొని పత్తి, కంది, జొన్న పంటలు వేసిన. రెండేళ్లలో వచ్చిన ఆదాయంతో రెండు ఎడ్లు కొనుక్కొని ఎవుసం హాయిగా జేస్తున్న. సర్కార్ చేస్తున్న సాయం, బ్యాంక్ డబ్బులతో ఎలాంటి రంది లేకుండా పంటలు మంచిగ పండిస్తున్న. సేట్ల వద్ద అప్పు తీసుకునే పనిలేకుండా సీఎం సార్ గరీబోళ్లకు అండగా నిలబడిన్రు. ఏడాది వానలు బాగా కురియడంతో లాభం కొంత తగ్గినా గతంలో లాభదాయకంగానే పంటలు పండినయ్. తెలంగాణ సర్కార్, కేసీఆర్ సార్‌కు ధన్యవాదాలు.
-ఆత్రం మాణిక్‌రావ్, రైతు, మోడి(కెరమెరి)
రంది లేకుంటైంది..
నెన్నెల, జనవరి 3 : దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కన్నట్లు మాకు ముఖ్యమంత్రి కేసీఆరే దేవుడయ్యాడు. రైతుబంధు పథకం కింద రెండు పంటలకు పెట్టుబడి సాయమందించి ఆదుకుంటున్నడు. నాకు మా ఊరిలో ఎనిమిది ఎకరాల భూమి ఉంది. నా భర్త చనిపోయిన తర్వాత భూమంతా బీడుగానే ఉంది. కౌలుకు చేయమన్నా ఎవ్వరూ ముందుకు రాలే. నేనే దున్నుకుందామనుకున్న. కానీ చేతిలో చిల్లిగవ్వ లేకుండే. దుక్కి దున్నాలన్నా.. విత్తనాలు వేయాలన్నా.. పైసలు ఉండాలే. బ్యాంకుకు పోయి పంటలోను అడిగితే అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీసిన్రు. ఇగ తెలిసినోళ్ల దగ్గర అప్పు తెచ్చుకున్న. పంట చేతికచ్చినంక అప్పు తిరిగి కట్టిన. మొదట భూమి నా పేరు మీద లేదు. 2017లో పట్టా చేయించుకున్న. ఆ తర్వాత రైతుబంధు కింద ఎకరానికి రూ. 4 వేల చొప్పున రూ. 32 వేలు ఇచ్చారు. ఇగ అప్పటి నుంచి రైతుబంధు డబ్బులతోనే ఎవుసం చేసుకుంటున్న. అప్పు జోలికి పోకుంటైంది. ఇప్పుడు మొత్తం రూ. 40 వేలు రూపాయలు వచ్చినయ్. పెట్టుబడికి రంది లేకుంట చేసినందుకు సంతోషంగా ఉంది.-సుశీల, రైతు, నెన్నెల
ఉద్యోగం, బిజినెస్ సంతృప్తినివ్వలేదు
భీమారం, జనవరి 3 : నా పేరు భూక్యా రాజ్‌కుమార్‌నాయక్. మాది భీమారం మండలం బురుగుపల్లి గ్రామం. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన. హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసిన. 2014లో మా ఊరికి తిరిగొచ్చిన. 2015లో చెన్నూర్‌లో ఫర్నిచర్ షాప్ పెట్టుకున్న. రెండేళ్లు నడిపించిన. బిజినెస్ కలిసిరాలేదు. నా పేరు మీద 5 ఎకరాలు, నా భార్య సమత పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. రైతబంధు ద్వారా నాకు రూ. 25 వేలు, నా భార్యకు 15 వేలు వస్తున్నయ్. అందుకే బిజినెస్‌ను వదిలి వ్యవసాయం చేసుకుంటున్న. రైతుబంధు డబ్బులతో ఎవుసం చేసుకుంటు న్నం. ప్రైవేట్ ఉద్యోగం, బిజినెస్ నాకు తృప్తి నివ్వలేదు. వ్యవసాయంతో ఆనందంగా ఉంది. వ్యవసాయం మీద ఆధారపడే ఇల్లు కట్టిన. పుట్టిన ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ తల్లి దండ్రులు, నా కుటుంబాన్ని చూసుకుంటున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో ఈ రోజు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు సైతం తిరిగి ఊర్లకు వచ్చి వ్యవసాయం చేస్తున్నరు.