
తుదిదశకు చేరిన చెనాక-కొరాట పంప్‌హౌస్ పనులు
ఇప్పటికే బరాజ్, ప్రధాన కాల్వలు పూర్తి
వానకాలం పంటకు సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు
ఆదిలాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా సాగునీటి రంగంలో నిర్లక్ష్యానికి గురైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం, కేసీఆర్ సీఎం కావడంతో వ్యవసాయం పండుగలా మారింది. ఇందులో భాగంగా సాగునీటి కోసం ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంలను మిషన్ కాకతీయలో భాగంగా మరమ్మతులు చేపట్టింది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా జలసిరి సంతరించుకున్నది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో 52 వేల ఎకరాలకు నీరందించేందుకు మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్న చెనాక-కొరాట ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే బరాజ్, ప్రధాన కాల్వలు పూర్తికాగా.. పంప్‌హౌస్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి, వానకాలం పంటకు సాగునీరు అందించనున్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు లోని పెన్‌గంగపై జైనథ్ మండలం కొరాట వద్ద చెనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతున్నది. ఇప్పటికే బరాజ్, ప్రధాన కాలువల పనులు పూర్తికాగా, పంప్‌హౌస్ తుదిదశకు చేరుకున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని 52 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ప్రభత్వం పనుల కోసం రూ.384 కోట్లను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో నిర్మించే కాలువల కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు రూ.1,227 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ పనులు పూర్తి చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే బరాజ్, ప్రధాన కాలువల పనులు పూర్తికాగా, పంప్‌హౌస్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. 0.98 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు బరాజ్ పనులు పూర్తయ్యాయి. 23 పిల్లర్లు నిర్మించడంతో పాటు గేట్లు అమర్చారు. రెండు అబట్మెంట్స్ నిర్మాణాలు పూర్తికాగా, రిజర్వాయర్‌కు మహారాష్ట్ర వైపు గోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 47 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా, పనులు పూర్తయ్యాయి. వీటితో పాటు 129 బ్రిడ్జీలు నిర్మించారు. ప్రెజర్ మెయిన్స్‌కు సంబంధించి 4 కిలోమీటర్ల మేర పైపులు వేశారు. పంప్‌హౌస్ నుంచి ప్రెజర్ మెయిన్స్‌కు నీటిని ఎత్తిపోసి, అక్కడి నుంచి కాలువలకు విడుదల చేస్తారు. భారీ మోటర్ల ద్వారా బరాజ్ నుంచి పంప్‌హౌస్‌లోని నీటిని తోడి నాలుగు కిలోమీటర్ల మేర ప్రెజర్ మెయిన్స్‌కు తరలిస్తారు.
చివర దిశలో పంప్‌హౌస్ పనులు
బరాజ్‌లో నిలిచే నీటిని ఎత్తిపోసేందుకు రూ.100 కోట్లతో పంప్‌హౌస్ పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనులు కూడా చివరిదశకు చేరుకున్నాయి. పంప్‌హౌస్ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ కింద నాలుగు ఫ్లోర్లను నిర్మించారు. బరాజ్‌లో నీరు నిలిచే చివర ప్రాంతం నుంచి మూడు కింద ఫ్లోర్లను నిర్మించారు. కొరాట వద్ద బరాజ్‌లు నిర్మించగా, నాలుగు కిలోమీటర్ల దూరంలో పిప్పల్‌కోటి వద్ద పంప్‌హౌస్ నిర్మాణం జరుగుతున్నది. నిల్వ ఉన్న నీటిని పంప్‌హౌస్ నుంచి సిస్టర్న్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి కాల్వల ద్వారా పంట పొలాలకు చేరుతుంది. నీటిని తరలించేందుకు పంప్‌హౌస్‌లో మొత్తం 6 మోటర్లను బిగిస్తున్నారు. ఇందులో కుడి వైపు కాలవలకు నీటిని తరలించేందుకు 3 మోటర్లు (12 మెగావాట్లు సామ ర్థ్యం) ఎడమ వైపు నీటిని ఎత్తిపోసేందుకు 3 మోటర్లు (5.5 మెగావాట్ల సామర్థ్యం) ఏర్పా టు చేస్తున్నారు. పంప్‌హౌస్‌లోని మోటర్లను నడిపించేందుకు వీలుగా సమీపంలో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించారు. అలాగే మోటర్లను ఆన్/ఆఫ్ చేసేలా ప్రత్యేక ప్యానెల్ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. కుడి వైపు ఏర్పాటు చేసిన పైపుల ద్వారా 3 కిలోమీటర్లు, ఎడమ వైపు పైపుల ద్వారా కిలోమీటర్ మేర నీటిని ఎత్తు ప్రాంతంలో ఉన్న సిస్టర్న్‌కు తరలించాల్సి ఉంటుంది. రెండు వైపులా మోటర్లు 111 మీటర్ల ఎత్తువరకు నీటిని ఎత్తిపోస్తాయి. సిస్టర్న్ నుంచి కుడి, ఎడమ కాలవల ద్వారా గ్రావిటీ పద్ధతిలో పంటలకు నీరు చేరుతుంది.