
ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్
ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్ల పరిశీలన
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం 15 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఒమిక్రాన్, థర్డ్‌వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం సూచనల మేరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో టీనేజర్లకు వ్యాక్సిన్ అందించారు. కాగా, ఆయా చోట్ల కేంద్రాలను ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు, డీఎంహెచ్వోలు పరిశీలించారు.
శాంతినగర్ పట్టణ పీహెచ్సీలో ఆదిలాబాద్ కలెక్టర్..
ఎదులాపురం, జనవరి 3 : శాంతినగర్ పట్టణ పీహెచ్సీలో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. టీకా తీసుకునేందుకు పిల్లలు ఉత్సాహంగా ముందుకువస్తున్నారన్నారు. జిల్లాలో 49,620 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వారందరికీ వేసేందుకు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. అర్హులందరికీ ఇంటింటా తిరిగి వైద్య సిబ్బంది టీకా వేస్తారని చెప్పారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఐవో మెట్పెల్లివార్ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ శైలజ, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సోన్‌లో నిర్మల్ కలెక్టర్ తనిఖీ..
సోన్, జనవరి 3 : పట్టణంలోని సోన్ కేజీబీవీతో పాటు సోఫీనగర్ గురుకులం, సోన్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని నిర్మల్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. పిల్లలతో ఆయన మాట్లాడారు. సోన్ పాఠశాలకు చెందిన 80 మంది విద్యార్థులు టీకా తీసుకున్నారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. విద్యాసంస్థల్లోని 12,646 మందికి టీకా వేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, డీఈవో రవీందర్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారి సలోమీకరుణ, తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, ప్రిన్సిపాళ్లు గంగాధర్, లత ఉన్నారు.
నిర్మల్, మామడలో డీఎంహెచ్‌వో..
నిర్మల్ చైన్‌గేట్/మామడ, జనవరి 3 : నిర్మల్ రాంనగర్ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ తీరును.., మామడ పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో ధన్‌రాజ్ పరిశీలించారు. పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు, అర్హులు టీకాలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, డిప్యూటీ విస్తరణ, మీడియా అధికారి బారే రవీందర్, వైద్యాధికారి నాగేశ్వర్రావు, డాక్టర్ వెంకటేశ్, సీహెచ్‌వోలు రమణ, లస్మన్న, ఫార్మాసిస్ట్ సతీశ్, ఆరోగ్య సహాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.