
నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్
ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
నిర్మల్ అర్బన్, జనవరి 3 : ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంలో పోలీసు అధికారులు జాప్యం చేయవద్దని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అర్జీదారుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. వారిని ఆప్యాయంగా పలుకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని, ఇతరుల ప్రమేయం, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పోలీసు సాయం కావాలనుకునే వారు నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కొవిడ్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తాం..
నిర్మల్ చైన్‌గేట్, జనవరి 3 : జిల్లాలో కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొవిడ్ నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలకు జిల్లా ప్రజలు తమకు సహకరించాలన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు. 10వ తేదీ వరకు అవి అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, మతపరమైన, రాజకీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించారు.