
ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
పార్కులను తలపిస్తున్న రాయిగూడ ఆశ్రమ పాఠశాల
సిరికొండ, జనవరి 2 : మండలంలోని రాయిగూడ ఆశ్రమోన్నత, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ, ప్రాథమిక పాఠశాలలు పచ్చదనం పరుచుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పాఠశాలల ఆవరణలు మొక్కలతో కళకళలాడుతున్నాయి.
హరితహారంలో నాటిన మొక్కలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించింది. రెండేళ్ల కిందట మండలంలోని పలు పాఠశాలల్లో నాటిన హరితహారం మొక్కలు నేడు ఏపుగా పెరిగి పచ్చదనంతో ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి.
ప్రత్యేక చొరవతో..
మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మొక్కలు ఏపుగా పెరిగాయి. మొక్కలను కొంత మంది విద్యార్థులకు దత్తత ఇచ్చి సంరక్షణ చేపట్టారు. వాటికి రోజు నీరుపోస్తూ కాపాడుతున్నారు. రాయిగూడ ఆశ్రమోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిశికాంత్ పాఠశాలలో అనేక రకాల మొక్కలు నాటారు. ఖాళీ సమయాల్లో విద్యార్థులు చెట్ల కింద కూర్చోవడానికి రూ.15 వేలతో ప్రత్యేక సిమెంట్ బెంచీలు వేయించారు.
ప్రధానోపాధ్యాయుడి చొరవతోనే..
ప్రధానోపాధ్యాయుడి చొరవతోనే మొక్కలు నాటిన. వాటిని సంరక్షించుకోవడం కష్టమైన పని. గతంలో మా పాఠశాలకు కంచె లేకపోవడంతో నాటిన మొక్కలను పశువులు వచ్చి తినేశాయి ప్రధానోపాధ్యాయుడి సహకారంతో కంచె ఏర్పాటు చేయించారు. విద్యార్థుల కోసం బెంచీలు వేయించారు. మొక్కలను కాపాడి పెంచితే అవి చెట్లుగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతాయి
-రాథోడ్ శివ కుమార్, విద్యార్థి,ఆశ్రమోన్నత పాఠశాల, రాయిగూడ