
బేలర్ యంత్రంతో రైతులకు సులువైన వరి గడ్డి సేకరణ
సమయం, డబ్బు ఆదా
గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చిన మిషన్లు
దస్తురాబాద్, జనవరి 2 : హార్వెస్టర్‌తో వరి కోసిన తర్వాత గడ్డి సేకరణకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకవేళ గడ్డిని కుప్పలుగా వేసి కట్ట కట్టాలంటే అధిక ఖర్చు అవుతుంది. సాధారణంగా కూలీలతో కోసిన వరి గడ్డి పొడవుగా ఉండి సేకరణ సులువుగా ఉంటుంది. కానీ.. హర్వెస్టర్తో కోసిన గడ్డి చిన్నగా ఉండి సేకరించడం, తరలించడం కష్టం. ఎద్దులు, ఆవులు, బర్రెలున్న రైతులు ఖర్చును కూడా భరించి ఎక్కువ మంది కూలీలను పెట్టి మరీ గడ్డిని సేకరిస్తారు. వాటిని వాములుగా పేరుస్తారు. దీనికి ఎకరానికి సుమారుగా రూ.2500 దాకా ఖర్చు అవుతుంది. మరికొందరు రైతులైతే గడ్డి తీసుకెళ్లడం ఇష్టం లేక నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఖర్చును తగ్గించి, పర్యావరణం దెబ్బతినకుండా బేలర్ యంత్రంతో గడ్డిని సులభంగా సేకరించవచ్చు. కట్టలుగా చేసి తరలించడం కూడా ఈజీ. రైతులకు సమయం ఆదాతో పాటు ఆదాయాన్ని సమకూర్చుతుంది. రైతులు కూలీల కోసం ఎదురుచూసే పనుండదు.
బేలర్ యంత్రం ఉపయోగాలు..
గడ్డిని చుట్టలుగా చుట్టడంతో నిల్వ చేయడం ఎంతో సులువు.
గడ్డి కట్టలను ఒక చోట నుంచి మరోచోటికి సులువుగా తరలించుకోవచ్చు.
అతి తక్కువ మంది కూలీలతో గడ్డి సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. గడ్డి కాల్చివేసే అవకాశం ఉండదు కాబట్టి పర్యావరణం దెబ్బతినదు. భూసారం తగ్గదు.
గడ్డి వృథా పోకుండా రైతులకు అదనపు ఆదాయం వస్తుంది.
పశుగ్రాసం కొరత ఉండదు. పాడి రైతులకు ఈ యంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేలు కూడా జరుగుతుంది. కూలీల కొరతను రైతులు ఆధిగమించవచ్చు.
సొంత ట్రాక్టర్ ఉన్న రైతులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఈ యంత్రాన్ని నడపుకోవచ్చు. ఒక ఎకరంలో సుమారు 50 కట్టల దాకా వస్తాయి. దీంతో రైతులు గడ్డి కొరత ఉన్న ప్రాంతాలకు విక్రయించవచ్చు. అతి తక్కువ సమయంలో గడ్డిని సేకరించి గడ్డి బేళ్లను కుప్పలుగా వేసుకొని రెండో పంట సాగుకు సన్నద్ధ కావచ్చు.
రైతులకు ఎంతో ఉపయోగం
గ్రాస్ యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యంత్రంతో గడ్డి సేకరణ సులువుతుంది. గతంలో గడ్డిని కుప్పలుగా వేసి ఆ తర్వాత మరోచోటికి తీసుకెళ్లి గడ్డి వాములుగా పెట్టే వారు. దీనికి సమయం, డబ్బు వృథా అయ్యేవి. కానీ ఈ యంత్రం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఈ యంత్రంతో కట్టిన గడ్డి కట్టలు తరలించడం, కుప్పలుగా పెట్టడం ఎంతో సులువు. ఆధునిక పద్ధతి వైపు రైతులు దృష్టి సారించాలి.