
అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న నిపాని
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
భీంపూర్, జనవరి 2 : గ్రామాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. దీంతో పల్లెలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. భీంపూర్ మండలం నిపాని గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, డ్రెనేజీలు నిర్మించడంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి.
రూ.అరకోటితో సీసీ రోడ్ల నిర్మాణం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుతల వారీగా జిల్లా పరిషత్, ఈజీఎస్, జీపీ గ్రాంట్లతో సర్పంచ్ భూమన్న పంచాయతీ సభ్యులు, వీడీసీ సహకారంతో గ్రామంలో 95 శాతం సీసీ రోడ్లు పూర్తి చేశారు. మిగిలిన వార్డుల్లో కూడా సీసీ రోడ్లు నిర్మించనున్నారు.
ఆరోగ్యవంత వాతావరణం
గ్రామంలో సీసీ రోడ్లకు అనుగుణంగా మురుగు కాలువలు నిర్మించడంతో ఆ నీరంతా దిగువకు చేరుతున్నది. దీనికి తోడు పంచాయతీ సిబ్బంది నిత్యం పారిశుధ్య పనులు చేపట్టడంతో గ్రామంలో ఆరోగ్యవంత వాతావరణం ఏర్పడింది.
అందరి సహకారంతో అభివృద్ధి
గ్రామంలో అందరి సహకారంతో అభివృద్ధి చేస్తున్నా. వానకాలంలో ఎక్కడ బురద, మురుగు నీరు నిలువ ఉండకూడదనే సీసీ రోడ్లు, డ్రెనేజీలు నిర్మించా. పంచాయతీ కార్యదర్శి, ఇతర శాఖల అధికారుల సహకారంతో త్వరలో వందశాతం సీసీ రోడ్లు పూర్తి చేస్తాం. -జీ భూమన్న, సర్పంచ్, నిపాని