
పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్
సబ్సిడీ గొర్రెల పథకంపై జిల్లా అధికారులతో సమీక్ష
నెన్నెల మండలంలో యూనిట్ల పరిశీలన
హాజీపూర్, జనవరి 2 : జిల్లాలో గొర్రెల యూనిట్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని గుడిపేటలో ఉన్న పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో జిల్లా పశు వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మాంసానికి మంచి గిరాకీ ఉన్నదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కుర్మలకు గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. గొర్రెల యూనిట్ల పంపిణీపై జిల్లాలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని గణపూర్లో గొల్లకుర్మలకు ప్రభుత్వం అందజేసిన గొర్రెల యూనిట్లను పరిశీలించారు. అనంతరం బెల్లంపల్లి పశు వైద్యశాలను పరిశీలించామని తెలిపారు. లబ్ధిదారుల నిర్ణయం మేరకు గొర్రెలను కొని పంపిణీ చేస్తామని తెలిపారు. వాటికి జియో ట్యాగింగ్ కూడా చేస్తామని, ఒక యూనిట్లో 20 ఆడ గొర్రెలు, ఒక గొర్రె పొట్టేలు ఉంటాయని వివరించారు. సబ్సిడీ గొర్రెలు వచ్చిన వెంటనే కొందరు విక్రయిస్తున్నారని తెలిసిందన్నారు. గొర్రెల మందను వృద్ధి చేసుకొని ఆదాయం పొందాలని సూచించారు. 15 రోజుల్లో దీని పై రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ వాతావరణానికి అనుకూలంగా ఉండే ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలోని గొర్రెలు కొని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పశు ఆరోగ్య సంరక్షణ, పశువుల ఉత్పత్తి సామర్థ్యం, మేత కొరత నివారణ, సాంకేతిక పరంగా వచ్చే ఇబ్బందులు అధిగమించడం, ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడం అనే అంశాలపై క్లుప్తంగా సమీక్షించారు. ఈ సమీక్షా కార్యక్రమంలో మంచిర్యాల పశు సంవర్ధశాఖ ఏడీ ఈర్ల శంకర్, చెన్నూర్ పశు సంవర్ధశాఖ ఏడీ బీ శంకర్, లక్షెట్టిపేట పశు సంవర్ధశాఖ ఏడీ మాజీద్‌తో పాటు జిల్లాలోని పశు వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
గొర్రెలతో సంపద పెంచుకోవాలి
నెన్నెల, జనవరి 2 : ప్రభుత్వం సబ్సిడీపై అందించిన గొర్రెలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లబ్ధిదారులకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ సూచించారు. ఆదివారం సాయంత్రం నెన్నెల మండలంలోని ఘన్పూర్ గ్రామంలో రెండో విడుతలో అందించిన గొర్రెలను ఆయన పరిశీలించారు. గొర్రెలకు ఆహారం అందించడానికి పరిసరాలలో సుబాబుల్ చెట్లు పెంచుకోవాలని సూచించారు. గడ్డి విత్తనాలు తీసుకొని చేన్లలో చల్లుకొని గొర్రెలకు మేత అందించాలన్నారు. ఈజీఎస్ ద్వారా షెడ్డు నిర్మించుకోవాలని సూచించారు. మొదటి విడుతలో తీసుకున్న కాపరి రమేశ్ గొర్రెలను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. గొర్రెలను మేపేందుకు అడవిలోకి అనుమతించేలా చూడాలని డైరెక్టర్‌ను లబ్ధిదారులు కోరారు. ఆయన వెంట జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ శంకర్, నెన్నెల వెటర్నరీ డాక్టర్ దిలీప్, టీఆర్ఎస్ నాయకులు సాగర్‌గౌడ్ ఉన్నారు.