
ఏప్రిల్‌లోగా పనులు పూర్తి చేయాలి..
ఈ యేడాదే కళాశాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు..
త్వరలోనే మెడికల్ ఆస్పత్రి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు..
రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
మంచిర్యాలలో మెడికల్ కళాశాల పనుల పరిశీలన
మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 1: పేదల కోసమే సీఎం కేసీఆర్ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద నిర్మిస్తున్న వైద్య కళాశాల భవనాల పనులను మంచిర్యాల టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మె ల్యే దివాకర్ రావు, కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి మంగళవారం పరిశీలించారు. ముందుగా జిల్లాకు మెదటిసారి వచ్చి న ఆయనకు మంచిర్యాల ఐబీ గెస్ట్ హౌస్‌లో జిల్లా నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి వైద్యకళాశాల పనుల పరిశీలనకు బైక్ ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మా ట్లాడారు. భవనాల పనులను ఆర్అండ్బీ శాఖకు అప్పగించారని, ఆ నేపథ్యంలో పనుల పురోగతిని తెలుసుకునేందుకు జి ల్లాకు వచ్చానని పేర్కొన్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు కేటాయించారని, ఇందులో కాలేజీ నిర్మాణానికి రూ.200 కోట్లు, దవాఖాన కోసం రూ.300 కోట్లు కేటాయించారన్నారు. ఈ విద్య సంవత్సరంలోనే వైద్య కళాశాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏప్రిల్‌లోగా మిగితావి పూర్తి చేయాలన్నారు. మొదటి సంవత్స రం ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లాస్ రూంలు, ల్యాబ్, లైబ్రరీ ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే తొందరలోనే దవాఖాన భవనం పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. పనులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని కోరారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మ న్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లు భూమేశ్, డిపార్ట్మెం ట్ ఏఎంసీ గణపతి రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నాదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో 158 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందని, ఇందులో ఉత్తరప్రదేశ్‌లో ప్రతి జిల్లాకూ ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నాదన్నారు. తెలంగాణలో కూడా నిర్మించాలని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాంత ఎంపీల పనితీరును ప్రజలు గమనించాలని ఆయన కోరారు.