
సిమెంటు పరిశ్రమకు మొండిచేయి
విమానాశ్రయ ఏర్పాటు ప్రస్తావన లేదు..
ఆర్మూర్-ఆదిలాబాద్ రైలు మార్గానికి కేటాయింపులు లేవు..
కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసుల అసంతృప్తి
ఆదిలాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విస్మయానికి గురిచేసింది. మూత పడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునఃప్రారంభించాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తుతున్నా.. ఢిల్లీలోని బీజేపీ సర్కారు పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వేలైన్‌కు కూడా నిధులు కేటాయించలేదు. ఆదిలాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్ గురించి ప్రస్తావన రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచక పోగా.. ఉడాన్ పథకంలో భాగంగా ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుపై ఎలాంటి చర్చ లేకపోవడంపై మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొండిచేయి చూపింది. జిల్లావాసుల విజ్ఞప్తులు, ఆందోళనలు కనీసం పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర పరిధిలో ఉన్న వాటికి నిధులు కేటాయించ లేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సిమెంట్ పరిశ్రమకు నిధులు నిల్..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 1998లో మూతపడింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీసీఐని పునః ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్రం రాయితీలు ఇస్తుందని, తిరిగి ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు. మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర పెద్దలకు లేఖ కూడా రాశారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పరిశ్రమకు భూములు ఇచ్చిన వారు సీసీఐ సాధన కమిటీగా ఏర్పడి ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ బడ్జెట్లో అయినా నిధులు కేటాయిస్తుందని అందరూ ఊహించారు. కానీ.. వేలాది మందికి ఉపాధి కల్పించడంతోపాటు ఫ్యాక్టరీని పునరుద్ధరించే అవకాశాలు ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోలేదు. బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించక పోవడంపై జిల్లావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు మొండిచేయి..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు రైలులో వెళ్లాలంటే మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల మీదుగా పోవాల్సి వస్తున్నది. ఇందుకు 9-10 గంటల సమయం పడతుంది. ఆర్మూర్ వరకు రైల్వే మార్గం ఉన్నందునా అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు సర్వే నిర్వహించిన అధికారులు రూ.2,700 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ రైల్వే లైన్‌కు కేంద్రం నిధుల కోసం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కానీ.. ఈ బడ్జెట్లో కూడా కేంద్రం ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ ఎలాంటి నిధులు కేటాయించక జిల్లావాసుల ఆశలను అడియాశలు చేసింది.
పారిశ్రామిక కారిడార్ ఊసేలేదు..
జాతీయ రహదారి-44 ఆదిలాబాద్ జిల్లాలోని పలు మం డల కేంద్రాలు, గ్రామాల మీదుగా వెళ్తున్నది. దాదాపు 120 కిలోమీటర్ల మేర ఉండగా.. కారిడార్‌గా మార్చాలని నాయకు లు పలుమార్లు కేంద్రాన్ని కోరారు. జాతీయ రహదారిపై పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులకు ఉపాధి లభించడంపా టు యువతకు ఉద్యోగాలు వచ్చే అవశాలున్నాయి. పలు ప్రాం తాలు అభివృద్ధి చెందుతాయి. జిల్లాలోని పరిశ్రమల ఏ ర్పాటుకు అనువైన పరిస్థితులు కూడా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్- నాగ్‌పూర్ కారిడార్ ఏర్పాటు గురించి ఉసే లేకపోవడంతో జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విమానాశ్రయం ప్రస్తావనే లేదు..
ఉడాన్ పథకంలో భాగంగా ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం 2019 జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలో పర్యటించిన అధికారుల బృందం ఎయిర్‌పోర్టు మైదానాన్ని పరిశీలించి సానుకూలంగా నివేదికలు అందజేసింది. విమానాశ్రయ నిర్మాణం వల్ల పరిసర ప్రాంతాలు భారీగా అభివృద్ధి చెందడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. ఈ బడ్జెట్లో ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటు కోసం నిధులు కేటాయిస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్న ఎలాంటి ప్రస్తావన రాలేదు. అదేవిధంగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,080 మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో పని చేస్తున్నారు. వీరందరూ కూడా ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. కానీ.. కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంతో ఆదాయపన్ను పరిమితి పెంచడానికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన చేయగపోవడంతో వేతనజీవులకు నిరాశ ఎదురైంది.
మాటల గారడీ..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కేంద్ర పరిధిలో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడం శోచనీయం. మూతబడిన ఆదిలాబాద్ సీసీఐని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖలు కూడా రాశారు. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశలు పెట్టుకున్నా నిరాశే మిగిలింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు ఉపయోగపడే ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్ విషయంలో మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బడ్జెట్లో కేంద్రం ప్రధాన రంగాలను విస్మరించింది. – దండె విఠల్, ఎమ్మెల్సీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
రాష్ర్టాల ప్రస్తావన లేకపోవడం బాధాకరం..
కేంద్ర బడ్జెట్లో రాష్ర్టాల ప్రస్తావన లేకపోవడం బాధాకరం. రాష్ర్టాలకు తాము ఏమి చేస్తామని చెప్పలేదు. 2025-26లో వృద్ధి రేటు తగ్గిస్తామంటున్నారు. భవిష్యత్‌తో ఏమో చేస్తామని చెప్పడం విడ్డూరం. ప్రస్తుత బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయిస్తారో స్పష్టం చేయాలి. కేంద్ర మంత్రి నిర్మల ప్రజలకు మాయమాటలు చెప్పి ప్రసంగం ముగించారు. అంకెల గారడీ చేశారే తప్పా ప్రయోజనం శూన్యం. పరిశ్రమలు, వ్యవసాయం, వైద్య, విద్య వంటి విషయాలను ప్రస్తావించలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు సిమెంటు పరిశ్రమను ప్రారంభించాలని ఆందోళనలు చేస్తున్నా స్పందన లేదు. ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్‌కు నిధులను కేటాయించ లేదు.-జోగు రామన్న, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్
రాష్ట్రంపై చిన్నచూపు..
ఆసిఫాబాద్, ఫిబ్రవరి1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా రాష్ట్రంపై చిన్నచూపు చూసినట్లుగా కనిపిస్తున్నది. కేంద్రం తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు, వ్యాపారులు, సామాన్యులు, పేదలు, వృత్తికులు, ఉద్యోగులను నిరాశపరిచేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచేలా బడ్జెట్ ప్రవేశ పెట్టింది.
–కోవ లక్ష్మి, జడ్పీ చైర్పర్సన్, కుమ్రం భీం ఆసిఫాబాద్