
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 1: కేస్లాపూర్లో మెస్రం వంశీయులు సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో నాగోబా జాతర ప్రారంభమైంది. భక్తజనంతో ఆలయ పరిసరాలు మంగళవారం కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి నాగోబాకు పూజలు చేశారు. మండల సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు కినక జుగాదిరావ్, మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్ పాల్గొన్నారు.
నాగోబా సన్నిధిలో కొత్తకోడళ్లకు బేటింగ్
మహాపూజల అనంతరం మెస్రం వంశీయుల ఆచారంప్రకారం72మంది కొత్త కోడళ్లకు నాగోబా సన్నిధిలో(బేటింగ్)పరిచయ వేదిక మెస్రం వంశీయుల పెద్దల సమక్షంలో నిర్వహించారు. భేటింగ్ అనంతరం(పరిచయం)కొత్త కోడళ్లకు నాగోబాను దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. మెస్రం వంశీయుల మహిళలతోపాటు కొత్తకోడళ్ల ఆధ్వర్యంలో 22కితల వారీగా అవ్వాల్దేవతకు సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలను సమర్పించి అవ్వాల్దేవతకు మొక్కులు తీర్చుకున్నారు. గోవాడ్‌లో బస చేసిన మహిళలు కితల వారీగా 22 పొయ్యిలపై సామూహికంగా వంటలు చేస్తున్నారు. నైవేద్యాల వెదురు బుట్టలవద్ద దీపాలు వెలిగించి పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. నాగోబా జాతర కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖతో పాటు కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్, మిషన్ భగీరథ పథకం ఆధ్వర్యంలో తాగునీటికి ఇబ్బంలు లేకుండా ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్‌తో పాటు ఇంద్రవెల్లి ఎస్ఐ నందిగామ నాగ్నాథ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆలయ నిర్మాణానికి కృషి చేయాలి
నాగోబా ఆలయ నిర్మాణానికి ఐక్యంగా కృషి చేయాలని మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ అన్నారు. ఆలయ ఆవరణలో సమ్మేళనం నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి రూ.25వేలు విరాళం అందించిన మెస్రం వంశీయులను సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కటోడ మెస్రం హనుమంత్‌రావ్, కటోడ మెస్రం కోశరావ్, కటోడ మెస్రం కోసురావ్, పర్ధాంజీ మెస్రం దాదారావ్, నాగోబా పేన్ కొత్వాల్ తిరుపతి, మెస్రం వంశీయుల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శులు సోనేరావ్, దేవ్‌రావ్, శేఖర్‌బాబు పాల్గొన్నారు.
పాము కనిపించడంతో..
నాగోబా ఆలయ ఆవరణలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పాము కనిపించడంతో భక్తులు దర్శించుకున్నారు. నాగోబాకు పూజల అనంతరం పాము కనిపించడంతో మెస్రం వంశీయులతోపాటు మహాపూజలకు వచ్చిన భక్తులు సంతోషించారు. మూడేళ్లుగా మహాపూజల రోజు పాము కనిపిస్తున్నదని మెస్రం వంశీయులు తెలిపారు.
నాగోబాను దర్శించుకున్న మెస్రం వంశీయులు
దస్తురాబాద్, ఫిబ్రవరి 1 : మున్యాల గొండు గూడెం, మల్లాపూర్, భూత్కుర్, చెన్నూర్ గ్రామాలకు చెందిన మెస్రం వంశీయులు 5 ఎడ్ల బండ్ల ద్వారా, కాలి నడక ద్వారా కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా జాతరకు బయలుదేరారు. మ్సైం వంశీయులు నాగోబాకు పూజలు నిర్వహించారు.