
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 1: టీఆర్ఎస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలోనే మంచిర్యాలను అద్భుతమైన జిల్లాగా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంగళవారం మంచిర్యాలలోని ఐబీలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని, తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని కమిటీలను నియమించి , ప్రతి కార్యకర్తనూ సైనికునిలా తీర్చిదిద్దేందుకు నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, ముఖ్యంగా సోషల్ మీడియాపై ఎక్కువ దృష్టి సారిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాలు, వార్డులు, మున్సిపాలిటీల్లోజనహిత సభలను నిర్వహించి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులు, సంక్షేమం, ఏయే శాఖల ద్వారా జరిగిన పనులను సంబంధిత వార్డుల్లో బోర్డులపై పెట్టనున్నామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో సోషల్‌మీడియా ప్రతినిధులకు శిక్షణ పూర్తయిందని, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో త్వరలోనే ఈ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జన్మదినంతోపాటు తెలంగాణ వైతాళికుల జయంతుల సందర్భంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలని సూచించారు. మంచిర్యాలకు మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్దేనని, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏనాడూ జిల్లా ప్రజలను పట్టించుకోలేదన్నారు. సాగు, తాగు నీటి రంగాలను నిర్లక్ష్యం చేశాయన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పధకాలతో రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యలను పారద్రోలారని కొనియాడారు.
సింగరేణి రక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని, ఇప్పటికే నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని చూసిందని, మంచిర్యాల జిల్లాలోని రెండు బ్లాకులు అందులో ఉన్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈ బ్లాకును వేలంలో దక్కించుకుని ఇక్కడికి వచ్చిన వారిని తరిమి కొడతామని హెచ్చరించారు. బీజేపీ నాయకులకు సిగ్గుంటే సింగరేణి విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దిష్టబొమ్మలు దహనం చేయాలన్నారు. లేదంటే కార్మికులే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రం వైఖరిలో మార్పు రాకుంటే జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలం ఒక్కరోజు దీక్షకు పూనుకుంటామని తెలిపారు. అన్ని గనులపై గేట్ మీటింగ్‌లు పెట్టి కేంద్రం వైఖరిని ఎండగడతామని తెలిపారు. తెలంగాణాపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుందని, బయ్యారం ఉక్కు, కాజీపేట కోట్ ఫ్యాక్టరీ, ఐసీఐఆర్, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, తదితర హామీలన్నీ విస్మరించిందని మండిపడ్డారు. జిల్లాలో ప్రతిపక్షాలే లేవని, వారి ఉనికికోసం మీడియాను వాడుకుంటూ పబ్బం గడుపుతున్నాయన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ గజదొంగను అధ్యక్షుడిగా పెట్టుకున్నదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి టీఆర్ఎస్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. పెరిగిన ఎరువుల ధరలు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్లపై బీజేపీ నాయకులు స్పందించాలని హితవుపలికారు. ఈ సమావేశంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, ప్రభాకర్, వైస్‌చైర్మన్ ముఖేశ్‌గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, ఎమ్మెల్యే తనయుడు విజిత్‌రావు, టీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, గరిగంటి సరోజ, అత్తిసరోజ, సందెల వెంకటేశ్, సుధీర్, తోట తిరుపతి, జగన్, చంద్రశేఖర్ హండే, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.