
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెట్టుబడి సాయం జమ
డబ్బులందుకొని మురిసిపోతున్న రైతులు
కోటపల్లి, జనవరి 1 : నా పేరు పుసాల సురేశ్. మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సూపాక గ్రామం. నేను దివ్యాంగుడను. నాకు పెళ్లయిన ఆరేండ్ల తర్వాత నాన్న నా పాలుకు మూడు ఎకరాల భూమి ఇచ్చిండు. నా భార్య కమలతో కలిసి ఎవుసం పనులు చేస్తున్న. అప్పులు తెచ్చి పంట వేస్తే దిగుబడి రాక నష్టపోయిన. ఇగ లాభం లేదనుకొని నాకున్న మూడెకరాల భూమిని కౌలుకు ఇచ్చిన. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రైతుబంధు పథకం తీసుకొచ్చి పెట్టుబడి సాయం అందజేస్తుండని తెలిసి.. ఆ యేటి నుంచి మేమే ఎవుసం చేసుకుంటున్నం. నాకు మొదట ఎకరానికి రూ. 4 వేల చొప్పున మూడెకరాలకు రూ. 12 వేల చెక్కు ఇచ్చిన్రు. ఆ డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుక్కున్నం. పొలం కూడా దున్నించినం. రెండో విడుత కూడా రూ.12 వేలిచ్చిన్రు. నా భార్య, నేను ఇద్దరం కష్టపడి పన్జేసినం. ఎకరానికి రూ. 25 వేలకుపైగా లాభం వచ్చింది. ఆ తర్వాత ఎకరానికి రూ. 5 వేల చొప్పున పెట్టుబడి సాయం పెంచిన్రు. ఇప్పుడు నాకు మూడెకరాలకు రూ.15 వేలు వస్తున్నయ్. ఏడాదికి రూ. 30 వేలు చేతికందుతున్నయ్. పెట్టుబడికి ఎవ్వరికీ చేయి చాచకుండా ఎలాంటి రంది లేకుంట ఎవుసం చేస్తున్నం. ప్రతి సంవత్సరం పత్తి అమ్మగా వచ్చే డబ్బులను నా బ్యాంకు ఖాతాలో జమ చేసుకుంటున్న. అట్లనే ఆసరా పింఛన్ కూడా నెలకు రూ.3016 వస్తున్నయ్. కేసీఆర్ సాయం చేయడం వల్ల భార్యా పిల్లల(బిడ్డా స్వాతి తొమ్మిదోతరగతి, కొడుకు సాత్విక్ ఏడో తరగతి)తో సంతోషంగా ఉంటున్న. కేసీఆర్ దయ వల్ల రూపాయి అప్పు లేకుండా దర్జాగా ఎవుసం జేత్తున్న.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతన్నకు పెట్టుబడి సాయం నిరాటంకంగా అందుతున్నది. శనివారం ఐదో రోజూ ఎకరాల వారీగా లబ్ధిదారులు ‘రైతుబంధు’ నగదు తీసుకున్నారు. పథకం ప్రారంభంలో చెక్కుల రూపంలో సాయమందించగా, ప్రస్తుతం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు వెళ్లి పెట్టుబడి నగదు డ్రా చేసుకొని మురిసిపోతున్నారు. సంబురంగా సాగుకు సిద్ధమవుతున్నారు.
కేసీఆర్ మా బతుకులు మార్చిండు..
జన్నారం, డిసెంబర్ 30 : నాపేరు అశెట్టి పోచన్న. జన్నారం మండలం లింగయ్యపల్లె గ్రామం. 30 ఏండ్ల సంది ఎవుసం చేస్తున్న. నాడు పంటలు వేయాల్నంటే అప్పులు చేయాల్సి వచ్చేది. పెట్టుబడి కోసం షావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లం. పంట చేతికొచ్చినంక వడ్డీతో సహా అప్పు కట్టేటోళ్లం. పంట సరిగా పండక పోతే అప్పు మీద పడేది. వడ్డీ పెరిగిపోయేది. అట్ల రెండు మూడు సార్ల చూసి ఎవుసం ఇడిసిపెట్టినోళ్లున్నరు. ఇగ ఇట్లుంటే కరెంట్ ఉంటే నీళ్లు& నీళ్లుంటే కరెంట్ ఉండేటిది కాదు. రాత్రీ పగలూ పొలాల కాడ ఉండి తిప్పల పడేటోళ్లం. అస్సలు రైతుల గోసను పట్టించుకున్నోళ్లు లేకుండే.. అరిగోస పడేటోళ్లం. ఇగ ఇప్పుడట్లా కాదు. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయినంక రైతుల బతుకులు మారిపోయినయ్. చెరువులు, ప్రాజెక్టులు మంచిగ చేయించి నీళ్లిత్తన్రు. ఉచితంగా 24 గంటల కరెంటిత్తన్రు. రైతు బంధు ద్వారా ఎకరాకు రూ. 5 వేలు కూడా ఇయ్యవట్టె. నాకు మా ఊరిలో ఎకరం గుంట భూమి ఉంది. డబ్బులు బ్యాంకు ఖాతాల పడ్డట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే పోయి డబ్బులు డ్రా చేసుకున్న. పోయినసారి వచ్చిన డబ్బులతో పొలంలో ఒడ్లు పోయించిన. వడ్లు కొనరని సార్లు చెబితే ఈ సారి వేరే పంటలు వేస్తున్న. 30 గుంటల్లో మక్క పెడుతున్న. 11 గుంటల్లో టమాట పండిస్తున్న. మాలాంటి రైతులకు రంది లేకుంట చేసిన సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం రైతులు రాజుగానే బతుకుతరు.
ధైర్యంగా ఎవుసం చేసుకుంటున్న..
నార్నూర్, జనవరి 1 : నాపేరు కోట్నాక్ నాగోరావ్. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ల ఉంట. మూడెకరాల భూమి ఉంది. అందులో ఎవుసం చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్న. నాకు ఇద్దరు బిడ్డలు. ఒక కొడుకు. ఆల్లని సదివియ్యాలంటే ఈ భూమే ఆధారం. దీన్ని నమ్ముకొని పంటలు వేసి, తిండికి, బట్టకు సంపాదించుకుంటున్న. కాని గతంల పెట్టుబడులకు చాన ఇబ్బందయ్యేది. పావలా వడ్డీకి అప్పు తెచ్చి పంట వేసేది. ఉద్దెరకు ఎరువులు,విత్తనాలు తెస్తుంటుని. కొద్దో గొప్పో లాభం వచ్చినా, వడ్డీకే పోయేది. ఇగ దిగుబడి రాకుంటే అంతే. తిప్పలు మాములుగా ఉండేది కాదు. ఇదే పెద్ద రందయ్యేది. ఒక్కోసారి పంట చేతికచ్చినంక వెంటనే కట్టేటోన్ని. కాని మిగిలేది తక్కువుండేది. ఇప్పుడే ఎవుసం ధైర్యంగా చేసుకుంటున్న. సర్కారోళ్లు రెండు సీజన్లకు పెట్టుబడి సాయం ఇస్తున్నరు. వడ్డీలకు తెచ్చుడు మాత్రం తప్పింది. ఎందుకంటే వాటిని కట్టేటప్పుడే తెలుస్తది బాధంతా. కేసీఆర్ సారు ఇత్తున్న రైతు బంధు నాకు కూడా ఈ యాసంగిల వచ్చింది. రూ. 15 వేలు నా అకౌంట్ల ఏసిన్రు. పోయిన కాలం కూడా రూ. 15 వేలు ఇచ్చిన్రు. గప్పుడు పత్తి, కంది, పెసర, మినుము పంటలు వేసిన. గిప్పుడు శనగ, జొన్న, గోధుమ వేద్దామనుకుంటున్న. ఇగ అప్పుల జోలికి పోతలేను. కేసీఆర్ సారు ఇస్తున్న రైతు బంధు కర్సు లేకుండా పంటలు వేసుకుంటున్న. ఇగ పెట్టుబడి పైసలు మిగులుతున్నయ్ కాబట్టి పిల్లల్ని మంచిగ సదివియ్యాలని అనుకుంటున్న. వాళ్లు మంచిగ బతుకుతనే నాకు సంతోషం. అందుకే కేసీఆర్ సారు ఇంత మంచి ఆలోచన చేసి తెచ్చిన్రు. మాలాంటి పేద రైతులకు ఆయన దేవుడే. ఎవలెన్ని చెప్పినా గతంల ఒక్కలన్నా గిట్ల రైతులకు భరోసానిచ్చిన్రా. ఎవుసాన్ని ఇప్పుడు ఇష్టంగ చేసుడు మళ్లా మొదలుపెట్టిన్రంటే అది కేసీఆర్ సారే కారణం. ఇగ నేనైతే ఇంత చేసిన కేసీఆర్ సారును అస్సలు మర్శిపోను.
భూమి చదును చేయించిన..
ఖానాపూర్ టౌన్, జనవరి 1 : నా పేరు గంగవ్వ. మాది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత తర్లపాడు. నా భర్త, నేను కలిసి ఎవుసం చేస్తం. మాకు ఏడెకరాల భూమి ఉంది. మాకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా.. అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. నా ఇద్దరు కుమారులకు చెరో రెండెకరాల చొప్పున నాలుగెకరాలు ఇచ్చాం. మాకు మూడెకరాలు ఉంచుకోగా ఇందులో పంటలు పండిస్తున్నాం. అరెకరం పసుపు, రెండెకరాల్లో వరి, మిగిలిన అరెకరంలో కూరగాయలు పండిస్తున్నాం. గత ప్రభుత్వాలల్ల పెట్టుబడికి ఇబ్బంది పడేది. కేసీఆర్ సారు సీఎం అయ్యాక ఎవుసం ఖర్చులకు అవస్థలు తప్పాయి. మొదటి, రెండు దఫాలుగా ఎకరాకు నాలుగు వేల చొప్పున రూ.24 వేలు వచ్చాయి. మూడో విడుత నుంచి గిప్పటి వరకు ఒక్కోసారికి రూ.ఐదువేల చొప్పున ఇస్తున్నారు. గిప్పటి వరకు రూ.90వేలు వచ్చాయి. మొత్తం ఎనిమిది విడుతల్లో రూ.1.14 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులు పెట్టుబడికి, పొలాన్ని చదును చేసుకోవడానికి వాడుకున్నాం. కేసీఆర్ సారు పెట్టుబడి సాయం చేయకముందు అప్పులు జేసి ఎవుసం జేసేటోళ్లం. గిప్పుడైతే ఇబ్బంది లేదు. రైతుబంధుతోపాటు కరంటు ఉత్తిగనే ఇస్తండు. రైతు బీమా కల్పిస్తున్నాడు. ఇత్తులు, ఎరువులు కూడా ఇస్తున్నడు. ఆయన సల్లంగుండాలె.
ఖాళీ భూమే లేకుంటయ్యింది..
ఉట్నూర్, జనవరి 1: నాది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్. ఈడనే నాకున్న రెండెకరాల్లో ఎవుసం చేస్తున్న. గతంల పొలం కాడికి పోవుడంటే ఎంతో తిప్పలయ్యేది. కరంట్ అస్సలుండేది కాదు. ఎప్పుడు అస్తదో.. ఎప్పుడు పోతదో కూడ తెల్వకపోయేది. రాత్రింబవళ్లు ఆడ్నే కాపలుండేది. ఇప్పుడా ఇబ్బంది తప్పింది. 24 గంటల కరంట్ ఉంటున్నది. అవసరమున్నప్పుడు నీళ్లు ఇగ రైతుబంధు వచ్చినప్పటి నుంచి అంతా మంచి రోజులచ్చినయ్. గతంల పెట్టుబడులకు బాగా ఇబ్బందుండే. ఇగ పైసలకు సేట్ల దగ్గరకు పోయి మిత్తికి తెచ్చేది. ఇప్పుడా అవసరం లేకుంటయ్యింది. సర్కారొళ్లే రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ. పదివేలు ఇస్తున్రు. ఇప్పటివరకు ఎనిమిది సార్లు తీసుకున్న. లక్షా అరవై వేలు వచ్చినయ్. ఎరువులు, ఇత్తనాలు, మిగతా పనులకు ఉపయోగపడినయ్. ప్రతిసారి బ్యాంకు ఖాతాల్నే పైసలు పడుతున్నయ్. ఎరువులు, విత్తనాలు కూడా సమయానికి వస్తున్నయ్. ఇగ అందరూ ఎవుసం పనుల మీద పడ్డరు. అసలు ఖాళీ జాగానే లేకుండా పొలాలు ఏసిన్రు. అంతా పచ్చటి పొలాలే కనిపిస్తున్నయ్. రైతుబంధు చేయబట్టే ఇదంతా. భూముల ధరలు కూడ పెరిగినయ్. – భక్తు స్వామి,(ఉట్నూర్ రైతు)