
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 30 : రక్తదానంతో బాధితులకు పునర్జన్మనిచ్చినట్లవుతుందని ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం ప్రభులత పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు రెడ్‌క్రాస్ సహకారంతో మంగళవారం స్థానిక డిపో ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 38 మంది 38 యూనిట్ల రక్తదానం చేశారు. ఆర్ఎం మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులు తరచుగా రక్తదానం చేస్తుండాలని సూచించారు. పేదరికం, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఈ రక్తదానం పునర్జన్మనిచ్చినట్లువుతుందన్నారు. ఆర్టీసీ సంస్థ పలు సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం జనార్దన్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ గంగేశ్వర్, సభ్యులు బండారి దేవన్న, ఆర్టీసీ డాక్టర్ భూమయ్య, ఉద్యోగులు రాజేందర్, రాజశేఖర్, హుస్సేన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులు రవీందర్, దేవన్న తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం చేసిన థర్డ్‌జెండర్ షేక్ హసీనా..
నేను సైతం అంటూ.. ఆదిలాబాద్ ఆర్టీసీ రక్తదాన శిబిరంలో థర్డ్ జెండర్ షేక్ హసీనా రక్తదానం చేసింది. ఆదిలాబాద్‌లో ఉంటున్న షేక్ హసీనా.. స్వచ్ఛందంగా శిబిరానికి వచ్చింది. ఇప్పటికి రెండు సార్లు రక్తదానం చేయగా, ఆర్టీసీ అధికారులు అభినందించారు.
రక్తదాన శిబిరం పరిశీలించిన నిర్మల్ కలెక్టర్..
నిర్మల్ అర్బన్, నవంబర్ 30 : పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపోల సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపారు. గవర్నర్, ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావని, అపోహలు వీడాలని సూచించారు. జిల్లాలో 60 మంది రక్తదానం చేశారని తెలిపారు. డిపో మేనేజర్ ఆంజనేయులు, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు సాయన్న, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.