
డీఎల్పీవో ధర్మారాణి
బహుళ అంతస్తులు కూల్చివేయాలంటూ నోటీసులు
ఇచ్చోడ, జనవరి 31 : ఇచ్చోడ ఏజెన్సీ మేజర్ గ్రామపంచాయతీలో 1/70 చట్టానికి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని ఆదిలాబాద్ డీఎల్పీవో ధర్మారాణి అన్నారు. ఇచ్చోడ జీపీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన దుకాణాలు, బహుళ అంతస్తులను సోమవారం స్థానిక జీపీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. నిర్మాణాదారులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లారు. ఇచ్చోడలో పలువురు గిరిజనేతరులు నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు, వాణిజ్య దుకాణాలు నిర్మిస్తున్నారని, వీటిని వెంటనే నిలిపివేయాలంటూ ఏజెన్సీ పరిరక్షణ సమితి నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దుకాణా సముదాయాలకు నోటీసులు అంటించి, నిర్మాణాదారులందరికీ నోటీసులను జారీ చేశామని చెప్పారు. ఏజెన్సీలో కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నిర్మించుకోవాలనీ, మొదటి, రెండు, మూడు అంతస్తులు నిర్మించిన వాటిని వెంటనే కూల్చివేయాలంటూ వినతి పత్రంలో వారు పేర్కొన్నట్లు తెలిపారు. నోటీసులు అందు కున్న వారందరూ గ్రౌండ్ ఫ్లోర్ మినహాయించుకొని, మిగతా నిర్మాణాలను కూల్చివేయాలని ఆమె స్పష్టం చేశారు. డీఎల్పీవో వెంట పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాశ్, మౌనిక, యూసుఫ్, మహ్మద్ ఉన్నారు.
ఆందోళనలో గిరిజనేతరులు
అధికారులు నోటీసులు జారీ చేయడంతో గిరిజనేతరులు ఆందోళన చెందుతున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్, జైనూర్, బేల నార్నూర్, గాదిగూడ ఏజెన్సీ కేంద్రాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండు, మూడు అంతస్తులు నిర్మించుకున్నారని, అక్కడ లేని నిబంధనలు ఒక్క ఇచ్చోడ జీపీలో అమలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నోటీసులపై తాము ఎంపీ సోయం బాపురావ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్తామని నిర్మాణదారులతో పాటు పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు.