
త్వరలో మారనున్న రూపురేఖలు
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ రూరల్, జనవరి 3 1 : పట్టణ అభివృద్ధికి రెండేళ్లుగా రూ.80 కోట్లతో పనులు చేపట్టామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే హరితహారం కార్యక్రమానికి మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేయడానికి రూ.1.25 కోట్లు, పట్టణ ప్రగతి కింద ఏర్పాటు చేసిన పార్కుల అభివృద్ధికి రూ. 20 లక్షలు, మరింత ఆకర్షించే విధంగా సెంట్రల్ లైటింగ్ కోసం రూ.20 లక్షలు కేటాయించామని తెలిపారు. పట్టణాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముందుంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. రానున్న మూడేళ్లలో పట్టణ రూపురేఖలు మార్చే విధంగా అభివృద్ధి పనులు చేపడుతామని స్పష్టం చేశారు. వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ మాట్లాడుతూ కొవిడ్ టీకాల నేపంతో మున్సిపల్ సిబ్బంది బయట తిరిగితే కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలు ఎవరూ పరిష్కరించాలని కమిషనర్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరన ఉందని పన్నులు వసూలు చేయాల్సిన అధికారులు టీకాల పేరుతో వార్డుల్లో తిరిగితే మున్సిపల్ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కష్టంగా మారుతుందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇతర సిబ్బందిని కేటాయించాలని మున్సిపల్ అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం 13 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు ఆమోదించారు. కార్యక్రమంలో కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు బండారి సతీశ్, జాదవ్ పవన్‌నాయక్, సంగీత, అర్చన, సాయి ప్రణయ్, రాజు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.