
నేటి నుంచి వ్యవసాయ శాఖలో అమలు
పనితీరు ఆధారంగా అధికారులకు మార్కులు
సంక్షేమ పథకాల పారదర్శకత కోసమే ప్రక్రియ
నిర్మల్ టౌన్, జనవరి 31 : వ్యవసాయశాఖలో పనిచేస్తున్న అధికారులకు గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న జిల్లా అధికారులు మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది దాకా పనితీరు ప్రామాణికంగా ఆన్లైన్ రిపోర్టు ఆధారంగా గ్రేడింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖలో అధికారుల పనితీరును పరిశీలించింది. కొందరు అధికారులు ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ ఆన్లైన్ రిపోర్టును ఏరోజుకారోజు నమోదు చేస్తుండగా.. కొందరు అధికారులు జాప్యం, నిర్లక్ష్యం చూపుతున్నారని గుర్తించింది. ఈ కారణంగా రైతులకు పౌర సేవల విషయంలో సత్వర లబ్ధి చేకూరకపోవడంతో గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్ సబ్ డివిజన్లు ఉన్నాయి. అన్ని శాఖల్లో వ్యవసాయశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి ఆన్లైన్లో పక్కాగా నమోదు చేసిన వారికి ఈ గ్రేడింగ్ విధానంలో అత్యధిక మార్కులు వేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పథకాల పారదర్శకత కోసమే…
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం ద్వారా అందే వివిధ పథకాలను సత్వరంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో గ్రేడింగ్ విధానాన్ని చేపట్టింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 79 వ్యవసాయ క్లస్టర్లుండగా.. 19 మండలాలున్నాయి. జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో పాటు నలుగురు ఏడీఏలు, 16 మంది వ్యవసాయశాఖ అధికారులు, 71 మంది వ్యవసాయ విస్తరణాధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఏటా పంట పెట్టుబడి సాయం, రైతుబీమా, సబ్సిడీ విత్తనాలు, పంట సర్వే, తదితర అంశాలను ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్ చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు జిల్లా పరిధిలో ఏడీఏలు, సహాయ డివిజన్ పరిధిలో ఏవోలు, మండల పరిధిలో ఏఈవోలు, క్లస్టర్ల పరిధిలో వివరాలు వందశాతం ఆన్లైన్లో నమోదు చేస్తే వారికి ఏ గ్రేడింగ్ ఇవ్వనున్నారు. 80శాతం నమోదు చేస్తే బీ గ్రేడ్, 70శాతం అమలు చేస్తే సీ గ్రేడ్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతుల కోసం ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా రూ. 5 లక్షలు అందిస్తున్నది. రైతు చనిపోతే బాధిత కుటుంబానికి మూడు రోజుల్లోనే బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నది. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వారం నుంచి 15 రోజుల సమయం పడుతుండడంతో రైతులకు ఆర్థిక సాయం అందడంలో జాప్యమవుతున్నది. మూడు రోజుల్లోనే ఆ ప్రక్రియను పూర్తి చేసేలా గ్రేడింగ్ విధానంలో పొందుపర్చినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు ఆయా జిల్లాలో పనితీరే ప్రామాణికంగా అందరి అధికారులకు గ్రేడింగ్ అమలు చేయనుండడంతో వెనుకబడిన వారి పనితీరు మెరుగుపర్చుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. వ్యవసాయశాఖలో అమలు చేస్తున్న అన్ని వివరాలను ఆన్లైన్ నమోదు ఆధారంగా ఈ గ్రేడింగ్ ఇవ్వడం రైతులకు పథకాల అమలులో త్వరగా ప్రయోజనం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.