
ఆదిలాబాద్ టౌన్, జనవరి 31 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ సెవ్వ లక్ష్మి పేర్కొన్నారు. ఆదిలాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలోని 34 గ్రామ పంచాయతీల పరిధిలో వానకాలం రైతుబంధు పథకం కింద 9,862 మందికి రూ.17.87కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, రైతు బీమా కింద 138 మంది వివరాలు పంపామని ఏవో అశ్రఫ్ వివరించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు వందశాతం వ్యాక్సినేషన్ వేయించామని ఎంఈవో జయశీల తెలిపారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ అవసరమైన వారికి మందులు అందజేస్తున్నామని పీహెచ్సీ వైద్యాధికారి రోజారాణి వివరించారు. రైతులు ఆయిల్ ఫాం సాగుపై శ్రద్ధ చూపాలని ఉద్యాన శాఖ ఏవో మహేశ్ సూచించారు. గిరిజన గ్రామాల్లో ఉద్యానవన పంటల గురించి అవగాహన కల్పించాలని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు వందయూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉచితంగా పొందవచ్చని అర్హులు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఏఈ తిరుపతిరెడ్డి సూచించారు. ప్రతి ఇంటికీ శుద్ధజలం అందుతున్నదని మిషన్ భగీరథ అధికారులు ప్రవీణ, సతీశ్ పేర్కొన్నారు. సమావేశానికి సాంఘిక సంక్షేమ, ఆర్టీసీ, ఐటీడీఏ, ఐకేపీ శాఖల అధికారులు హాజరుకాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ గండ్రత్ రమేశ్, ఎంపీడీవో శివలాల్, డిప్యూటీ తహసీల్దార్ గణేశ్, పీఆర్ ఏఈ రఫత్, ఎంపీవో ఆనంద్, పశువైద్యాధికారి రాథోడ్ దూదూరాం, ఎంపీటీసీలు గంగాధర్, జంగుబాపు, జంగు పటేల్, పుష్ప, సర్పంచ్‌లు భూమన్న, లక్ష్మణ్, విలాస్, యాదవ్రావ్, లక్ష్మి పాల్గొన్నారు.