
బోథ్, జనవరి 31: గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పొచ్చెర క్రాస్ రోడ్డులో గల ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్‌రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయి. మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటి నుంచి యువతను దూరం చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పని చేస్తున్నదని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించి గంజాయి సాగు జోలికిపోకుండా చేయాలని సూచించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, బజార్హత్నూర్ జడ్పీటీసీ నర్సయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, బోథ్ సర్పంచ్ సురేందర్‌యాదవ్, సీఐ ముదావత్ నైలు, ఎస్ఐ దివ్యభారతి, పోలీసు సిబ్బంది, బోథ్, బజార్హత్నూర్ మండలాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
పోలీస్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఎదులాపురం, జనవరి 31 : జిల్లా పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ క్యాలెండర్‌ను స్థానిక డీపీవో కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఉత్సాహంతో ప్రజలకు మరింత చేరువై విధులు నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందన్నారు. పోలీసు దర్యాప్తులో మరింత సాంకేతిక పరిజ్ఞానం జోడించి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన ఎస్ శ్రీనివాస్‌రావు, పోలీస్ కార్యాలయం ఏవో యూనిస్ అలీ, సూపరింటెండెంట్ జోసెఫిన్, ఎంటీవో శ్రీపాల్, సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సత్యనారాయణ, చిందం దేవీదాస్, తదితరులు పాల్గొన్నారు.