
ఇందారం గ్రామం వద్ద క్రేన్‌తో భారీ గజమాల
గులాబీ వనాన్ని తలపించిన నల్లనేల.. కిక్కిరిసిన జాతీయ రహదారి
కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం : విప్
రామకృష్ణాపూర్/జైపూర్/శ్రీరాంపూర్/ మంచిర్యాలటౌన్, జనవరి 31 : టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా జిల్లాకు వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు అభిమానులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సోమవారం చెన్నూర్ నియోజకవర్గంలోని ఇందారం గ్రామానికి చేరుకోగానే, పూలమాలలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వందలాది కార్లు, వేలాది బైక్‌లతో ర్యాలీ తీయగా జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. శ్రీరాంపూర్, మంచిర్యాల మీదుగా క్యాతనపల్లి మున్సిపాలిటీ వరకు సాగగా నల్లనేల గులాబీమయమైంది. ఓపెన్ టాప్ జీపులో రథసారథి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలగా, పలుచోట్ల మహిళలు మంగళహారతులతో తరలివచ్చి హారతి ఇచ్చారు. అనంతరం ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సభలో విప్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్కు కంచుకోట అని, రానున్న ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించి అధినేతకు కానుకగా ఇస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తనూ కడుపున పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై సోమవారం తొలిసారిగా జిల్లాకు వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు చెన్నూర్ నియోజకవర్గంలోని ఇందారం గోదావరి వద్ద అభిమానులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. వందలాది కార్లు, వేలాది బైక్‌లతో 63వ జాతీయ రహదారి కిక్కిరిసింది. అడుగడుగునా పటాకలు కాల్చుతూ సంబురాల్లో మునిగి తేలారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన భారీ బైక్, కార్ల ర్యాలీ శ్రీరాంపూర్, మంచిర్యాల మీదుగా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ వరకు సాగింది. అనంతరం అక్కడ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సభ నిర్వహించారు. తనపై నమ్మకంతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సహచర శాసన సభ్యులు, నాయకుల సహకారంతో బూత్‌స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. త్వరలో జిల్లాలోని అన్ని కమిటీలను పూర్తి చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తనూ కడుపున పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్కు కంచుకోట అని,
రానున్న ఎన్నికల్లో జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించి అధినేతకు కానుకగా ఇస్తామన్నారు. పార్టీకి, ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తానని రథసారథి బాల్క సుమన్ ఉద్ఘాటించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో పార్టీ కమిటీలను ఎంపిక చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జనహిత సభలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో చేపట్టిన అభివృద్ధిపై ప్రగతి నివేదన ప్రచార కార్యక్రమాలు వార్డులు, గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో సోషల్ మీడియా సభ్యులు ప్రధాన భూమిక పోషించాలని కోరారు. బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లోనూ సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ఇతర పార్టీలు లేవని, అబద్ధాలు, దుష్ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న విపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలన్నారు. బెలంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌ను నియమించడం హర్షనీయమని, పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ నల్లాల ఓదెలు మాట్లాడుతూ జిల్లాలోని కార్యకర్తలు మొదటి నుంచి ఎంతో నిబద్ధతో పార్టీకి అండగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ అందుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమాలాంటి ఎన్నో ప్రజాప్రయోజనకర పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నేతృత్వంలో కలసికట్టుగా పనిచేస్తే రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
అడుగడుగునా బ్రహ్మరథం..
టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా జిల్లాలో పర్యటించిన ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు అభిమానులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఇందారం గ్రామంలోని గోదావరి బ్రిడ్జి నుంచి క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ వరకు భారీ బైక్, కార్ల ర్యాలీ తీశారు. ఓపెన్ టాప్ జీపులో విప్ సుమన్ ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఆయన వెంట ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య ఉన్నారు. రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు మేడి సునీత ఆధ్వర్యంలో భారీ గజమాలను క్రేన్‌తో లేపి అధ్యక్షుడు బాల్క సుమన్ మెడలో వేశారు. ఎంపీటీసీ అరికె స్వర్ణ గొంగలితో సన్మానించి గొర్రె పిల్లను బహుకరించారు. పలువురు సింగరేణి కార్మికులు పూల మాలలు, శాలువాలతో సత్కరించారు. శ్రీరాంపూర్‌కు చేరుకోగానే సింగరేణి కార్మికుడి విగ్రహానికి, సీసీసీ నస్పూర్ కాలనీ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. అక్కడ రథసారథి సుమన్‌కు పలువురు మహిళలు, కార్యకర్తలు ఘనంగా హారతి ఇచ్చారు. జిల్లా కేంద్రం నుంచి ర్యాలీగా క్యాతనపల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌కు వెళ్తుండగా, బెల్లంపల్లి చౌరస్తా నుంచి రామకృష్ణాపూర్ వైపునకు వస్తున్న అంబులెన్సుకు దారి ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు. ఆపదలో ఉన్న వారికి దారి ఇచ్చిన బాల్క సుమన్‌ను పలువురు అభినందించారు.