
అర్ధరాత్రి మహాపూజలు అందుకున్న నాగోబా
మొక్కులు చెల్లించుకున్న మెస్రం వంశీయులు
ఇతర రాష్ర్టాల నుంచి తరలి వచ్చిన అడవిబిడ్డలు
భక్తులతో కోలాహలంగా మారిన కెస్లాపూర్ ఆలయం
ఇంద్రవెల్లి, జనవరి 31 : ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్‌లో మెస్రం వంశీయులు సంప్రదాయపూర్వకంగా సోమవారం అర్ధరాత్రి మహాపూజ నిర్వహించడంతో జాతర ఆరంభమైంది. అనంతరం ఇతరులకు పూజలు చేసేందుకు అవకాశం కల్పించారు. అంతకుముందు ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం అల్లుళ్లు కోనేరు నుంచి నీటినితోడగా మహిళలు మట్టి కుండల్లో తీసుకురావడం.. పాముల పుట్ట, బౌలదేవతను తయారు చేసి పూజించడం, 22 పొయ్యిల్లో నైవేద్యాన్ని తయారు చేసి నాగోబాకు సమర్పించారు. వారం రోజులపాటు జాతర కొనసాగనుండగా.. రంగులరాట్నాలు, దుకాణాలు ఆకట్టుకుంటున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర సోమవారం ప్రారంభమైంది. పవిత్ర గంగాజలంతో నాలుగు రోజులుగా మర్రిచెట్ల వద్ద బస చేసిన మెస్రం వంశీయులు ముందుగా.. కెస్లాపూర్‌లోని పురాతన(మురాడి) నాగోబా ఆలయానికి చేరుకొని సంప్రదాయ పూజలు చేశారు. పురాతన నాగోబా విగ్రహంతోపాటు వెలిగించిన దీపాలను వెదురుబుట్టలో పెట్టుకొని శోభాయాత్రగా ఆలయానికి బయల్దేరారు. వీరికి మర్రిచెట్ల వద్ద బసచేస్తున్న మెస్రం వంశీయులు స్వాగతం పలికారు. వీరందరూ కలిసి ఆలయానికి చేరుకుని మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించారు. అనంతరం పురాతన నాగోబా విగ్రహాలతోపాటు నాగోబా దేవత, సతీదేవత, బాన్దేవతలకు సంప్రదాయ పూజలు చేసి.. పురాతన విగ్రహాన్ని గర్భగుడిలోని నాగోబా విగ్రహం వద్ద పెట్టారు. ఆలయం వెనుకున్న బాన్దేవతలతోపాటు పెర్సపేన్కు పూజలు చేసి మళ్లీ ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం ఆలయం వెనుక ఉంచిన మట్టికుండలను 22 కితలకు చెందిన మెస్రం వంశీయుల మహిళలకు మెస్రం పెద్దలు పంపిణీ చేశారు.
కటోడ ప్రత్యేక పూజలు
మహాపూజకు ఉపయోగించే మట్టికుండలకు కటోడ హనుమంత్‌రావ్ పూజలు చేశారు. ఈ మట్టి కుండలతో 22 కితలకు చెందిన మహిళలు పురాతన బావి(నీటి కోనేరు) వద్దకు చేరుకున్నారు. మెస్రం వంశీయుల అల్లుళ్లు కోనేరులోని నీటిని తోడి మట్టికుండల్లో నింపారు. ఆ కుండలను మహిళలు తలపై పెట్టుకొని వరుసగా నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని పాత పాముల పుట్టలను అల్లుళ్లు తవ్వగా.. మహిళలు తెచ్చిన నీటితో మట్టిని కలిపి పాముల పుట్టలను తయారు చేశారు. అదే మట్టితో మరికొంత మంది మహిళలు బౌలదేవతను తయారు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బౌలదేవత పూజల్లో పాల్గొన్న మహిళలు, మెస్రం వంశీయులకు నాగోబా చరిత్రను తుకోడోజీ కిక్రి వాయిస్తూ పాటల ద్వారా వివరించారు.
సంప్రదాయ రీతిలో..
ఎడ్లబండ్లలో కుటుంబ సమేతంగా వచ్చిన మెస్రం వంశీయులు ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసుకొని మహాపూజకు అవసరమైన నైవేద్యాన్ని తయారు చేశారు. మహాపూజకు అరగంట ముందు నాగోబా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మెస్రం వంశీయులు గోవాడ్ నుంచి వెలిగించిన కాగడాలను చేతిలో పట్టుకొని వాయిద్యాలు వాయిస్తూ ఆలయానికి చేరుకున్నారు. నాగోబా ఆలయంలో మహాపూజలు నిర్వహించేటప్పుడు ఇతరులను లోనికి రానివ్వకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. 10 గంటల నుంచి రాత్రి 12 గంట వరకు మెస్రం వంశీయులే నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల మహాపూజల అనంతరం ఇతరులకు పూజలు చేసేందుకు అవకాశం కల్పించారు.
కెస్లాపూర్‌కు తరలివస్తున్న అడవిబిడ్డలు
తమ ఆరాధ్యదైవాన్ని దర్శించుకునేందుకు సోమవారం నుంచి భక్తులతోపాటు గిరిజనులు తరలివస్తున్నారు. వారం రోజులపాటు ఇక్కడే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో కెస్లాపూర్ కోలాహలంగా మారింది. జాతరలో వివిధ రకాల దుకాణాలు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేయడంతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, బాధిరావ్‌పటేల్, లింబారావ్పటేల్, జంగుపటేల్, కటోడ మెస్రం కోసురావ్, పర్ధాంజీ మెస్రం దాదారావ్, కొత్వాల్ మెస్రం తిరుపతి, మనుమంత్రావ్, కోశరావ్, మెస్రం వంశీయులు మనోహర్, దేవ్‌రావ్, సోనేరావ్, నాగ్నాథ్, శేఖర్‌బాబు, తుకారాం, ఆనంద్‌రావ్, ఆలయ పూజారి మెస్రం షేకు, గణపతి, మారుతి, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ భారతదేశంలో గిరిజనుల అతిపెద్ద దేవుడు నాగోబా..
దక్షిణ భారతదేశంలోని మెస్రం వంశీయుల అతిపెద్ద దేవుడు కెస్లాపూర్ నాగోబా. మెస్రం వంశీయులు వారి కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం(బేటింగ్)చేయడం వీరి ఆచారం. ఈ పూజలు చేసే వరకు ఇంట్లో దేవుళ్లకు కూడా మొక్కే అర్హత ఉండదు. ఈ మొక్కులు చెల్లించుకునేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, రాష్ర్టాల నుంచి మెస్రం వంశీయులు తరలివచ్చారు.