
ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రతిపక్షాలు
జిల్లాలో అందరి సహకారంతో పార్టీ పటిష్టం
సామాన్య వ్యక్తిగా నాపై పెద్ద బాధ్యత
ఏ ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్దే
‘నమస్తే తెలంగా’ ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జీ విఠల్‌రెడ్డి
ఆదిలాబాద్, డిసెంబరు 31 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)నమస్తే తెలంగాణ : జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
విఠల్‌రెడ్డి : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి కృతజ్ఞతలు. జిల్లాలో టీఆర్ఎస్ ఇప్పటికే బలంగా ఉంది. పార్టీని మరింత ముందుకు నడిపించేందుకు జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, రైతు బంధు సమి తి సభ్యులు, పదాధికారులు, కార్యకర్తల సహకారంతో జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతాను. సామాన్య వ్యక్తి అయిన తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద బాధ్యతను అప్పగించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాయశక్తుల పాటుపడుతా.
ప్రశ్న : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతారు..?
విఠల్‌రెడ్డి: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రభుత్వ పథకాలే ఆయుధాలుగా మల్చుకుని ప్రజల్లోకి వెళ్తాం. 95 శాతం మంది ప్రజలకు సర్కారు పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్నారు. దక్షిణాది రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నాయకులు తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను ప్రశంసించారు. దేశంలో ఇలాంటి పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు. ముథోల్ నియోజకవర్గానికి పక్కన ఉన్న మహారాష్ట్రలోని ధర్మాబాద్, నయాగాం, బోకర్ ప్రాంతాల ప్రజలు తమను తెలంగాణలో కలుపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలి సి కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మన పథకాలను వారు అమలు చేయడం లేదు. మన పథకాలు ఇంటింటికీ అందుతున్నాయి. గ్రామస్థాయిలో పథకాలు మరింత విస్తృతంగా ప్రచారం చూస్తాను.
ప్రశ్న : జిల్లాలో ప్రతిపక్షాల ప్రభావం ఏమైనా ఉందా..?
విఠల్‌రెడ్డి: జిల్లాలో ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడో కోల్పోయాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ ఉనికి కోసం లేనిపోని విమర్శలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రతిపక్షాల నాయకులను స్థానికులు ఊర్లోకి కూడా రానివ్వడం లేదు. ఎవరూ ఊహించని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు సైతం దొరకని పరిస్థితి ఉంటుంది. ఏ ఎన్నికలు జరిగినా జిల్లాలో టీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుంది.
ప్రశ్న: జిల్లా అభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు..?
విఠల్‌రెడ్డి: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్లలోనే నిర్మల్ జిల్లా ఎంతో అభివృద్ధి సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధారణకు గురైన జిల్లాలోని గ్రామాలు పల్లెప్రగతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా ప్రగతిబాటలో నడుస్తున్నాయి. నిర్మల్‌లో మెడికల్ కళాశాల త్వరలో ప్రారంభం కానున్నది. బీటీ రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. బాసర అభివృద్ధికి రూ.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ముథోల్, నర్సాపూర్ దవాఖానాలను ఉన్నతీకరించడం జరిగింది. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు వస్తాయి. గూడేగాం ప్రజలకు త్వరలో పునరావాసం కల్పిస్తాం. ‘మన ఊరు, మన బడి’ ద్వారా పేద విద్యార్థులకు ఇంగ్లిష్ చదువులు అందుతాయి. దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులు ఎంపిక జరుగుతుంది. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, ఇతర నాయకులు సహకారంతో జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేస్తాను.