
ఎదులాపురం, సెప్టెంబర్ 23 : కొవిడ్ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్వచ్ఛంద సంస్థల సహకారంతో కళాజాత నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆగాఖాన్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న కొవిడ్ ప్రచార రథాన్ని గురువారం కలెక్టరేట్లో ఆమె జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని గిరిజన కళాకారులను ఎంపిక చేసి గోండి, కొలాం భాషల్లో గిరిజన ప్రాంతాల్లో కొవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్త లు, వ్యాక్సినేషన్, మాస్క్ ధ రించండం, భౌతిక దూరం పాటించడం, తదితర అంశాలపై ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగాఖాన్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో కళాకారులకు పారితోషికం, రవాణా, ఇతర సౌకర్యాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు గ్రామాల్లో ఈ కార్యక్రమాలను పది రోజుల పాటు ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో నిర్వహిస్తారని తెలిపారు. కలెక్టర్ , వైద్య ఆరోగ్య శాఖ ఆధికారులు సూచించిన ప్రకారం గిరిజన గ్రామాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రోగ్రాం మేనేజర్ పీ కృష్ట తెలిపారు. కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు.