ఎదులాపురం, ఆగస్టు 26 : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని మైనార్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణితో కలిసి గ్రూపు -1, 2 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలు వెచ్చించి మైనార్టీ గురుకులాలు, వసతిగృహాలు ఏర్పాటు చేసి నాణ్యమైన బోధన అందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక చొరవతో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి అభ్యర్థి పోటీ పరీక్షల్లో ప్రతిభను కనబరిచి ఉద్యోగాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్ సలీం, నాయకులు ప్రవీణ్, ఐయూబ్, హైమద్, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కృషితో జిల్లాలో గురుకులాలకు సొంత భవనాలు నిర్మించుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేవీకేలో చేపడుతున్న మైనార్టీ గురుకుల భవన నిర్మాణాన్ని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణితో కలిసి పరిశీలించారు. నిర్మాణం పట్ల నాణ్యత ప్రమాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు అజయ్, సతీశ్, సలీం, నాయకులు ఉన్నారు.