ఎదులాపురం, ఏప్రిల్ 26 : ఆదిలాబాద్ రూరల్ మండలం చందా(టీ) బైపాస్ సమీపంలోని శ్రీనివాస దాబా ఎదుట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కొబ్బరి బొండాల లోడ్‌తో వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంటలు వ్యాపించి లారీ పూర్తిగా కాలిపోయింది. ఆదిలాబాద్ రూరల్ ఎస్ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి ఢిల్లీకి లారీ కొబ్బరి బొండాల లోడ్‌తో వెళ్తున్నది. మంగళవారం తెల్లవారుజామున డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో చందా (టీ) బైపాస్ సమీపంలో లారీ డివైడర్‌పైకి ఎక్కి బోల్తాపడింది. రోడ్డుపై రాపిడి ఏర్పడడంతో డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకొని, లారీ మొత్తం వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఫైర్స్టేసన్కు సమాచారం అందించారు.
ప్రమాద స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో క్లీనర్ రయీస్ఖాన్కు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ ఆసిఫ్ పరారీలో ఉన్నాడు. క్షతగాత్రుడిని రిమ్స్‌కు తరలించారు. అగ్నిమాపక అధికారులు కాంతారావు, ఎం రవి, మధూకర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరి బొండాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు అటుగా వెళ్తున్నవారు, స్థానికులు వాటిని సంచుల్లో తీసుకెళ్లడం కొసమెరుపు.