మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు
జిల్లా కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 12 : మన ఊరు మన బడి కార్యక్రమం అమలుకు పక్కాగా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆర్థిక శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు శనివారం జిల్లా కలెక్టర్లు, జడ్పీచైర్మన్లు, జడ్సీసీఈవోలకు మన ఊరు మన బడి కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కేజీ టూ పీజీ విద్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలో విద్య, మౌలిక వసతులు కల్పించేందుకు మొదటి దశ కింద రూ.3497 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో తరగతి గదులు, గోడ, తాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని కోరారు. పాఠశాలకు విరాళం ఇచ్చిన దాతలను ప్రోత్సాహం అందించాలని కోరారు. జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, సంబందిత అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీసీఈవో సుధీర్‌కుమార్, డీఈవో రవీందర్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రణాళికలు తయారు చేయాలి
ఎదులాపురం, ఫిబ్రవరి 12 : మన ఊరు మన బడి కార్యక్రమం అమలుకుప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్, అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, జడ్పీచైర్మన్లు, జడ్సీసీఈవోలకు మన ఊరు మన బడి కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి మొదటి సంవత్సరం 33 శాతం నిధులతో ప్రతిపాదించామని, ఈ పనుల వలన 60శాతం మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సోమవారం నుంచి శనివారంలోగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో, సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లోజడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీఏ కిషన్, డీఈవో ప్రణీత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.