నిర్మల్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభు త్వం వైద్యశాలల్లో మెరుగైన వసతులను కల్పించేందుకు నడుం బిగించింది. దీంట్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి చర్యలు చేపట్టింది. సొంత భవనాలు ఉన్నా ఏళ్లుగా మరమ్మతలు లేక పోవడంతో రోగులు, వైద్యులు, సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ఆయా పీహెచ్‌సీల్లో చేయించాల్సిన మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. స్పందించిన ప్రభుత్వం పీహెచ్‌సీల వారీగా నిధులు మంజూరు చేసింది. నిర్మల్ జిల్లాలో 16 పీహెచ్సీ లు, 3 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా యి. వాటన్నింటికీ సొంత భవనాలు ఉండగా పెంబి పీహెచ్సీ శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ రూ. 1.56 కోట్లతో కొత్త భవనం నిర్మించనున్నారు. మరో తొమ్మిది పీహెచ్‌సీల మరమ్మతుకు రూ.1,29,55,000 మంజూరయ్యాయి.
జిల్లాలో 16 పీహెచ్‌సీలు ఉండగా వీటిలో 9 పీహెచ్‌సీలకు అత్యవసరంగా మరమ్మతులకు గాను నిధులను మంజూరయ్యాయి. సోన్, లోకేశ్వరం, ముజ్గి, మామడ, లక్ష్మణచాంద, వెల్మల్ బొప్పారం, కడెం, కుంటాల, బాసర పీహెచ్‌సీల్లో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. సోన్ పీహెచ్‌సీకి రూ. 9.80 లక్షలు, లోకేశ్వరం పీహెచ్‌సీకి రూ. 9.90 లక్షలు, ముజ్గికి రూ. 9.95 లక్షలు, మామడకు రూ. 11లక్షలు, లక్ష్మణచాందకు రూ. 12.50 లక్షలు, వెల్మల్ బొప్పారానికి రూ. 14.50 లక్షలు, కడెంకు రూ. 19. 40 లక్షలు, కుంటాలకు రూ. 19. 50లక్షలు, బాసరకు రూ. 23 లక్షలు కేటాయించారు. పెంబి పీహెచ్‌సీకి కొత్త భవనం నిర్మించనున్నారు. ప్రభుత్వం నిధులను విడుదల చేయడంపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా పనులను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండరు ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చొరవ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సహకారం తో వైద్యశాలల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని డీఎంహెచ్‌వో ధన్‌రాజ్ తెలిపారు. జిల్లాలోని పీహెచ్‌సీల మరమ్మతు పనులతోపాటు పెంబిలో కొత్తగా నిర్మించనున్న పీహెచ్సీ భవనం కోసం రూ. రెండు కోట్లకుపైగా నిధు లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 సబ్‌సెంటర్లకు టీఎస్ఎంఐడీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో మరమ్మతు పనులు సాగుతున్నాయని వివరించారు. కొత్తగా మరో 23 సబ్‌సెంటర్ల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు. ఒక్కో సబ్‌సెంటర్ నిర్మాణానికి రూ.20లక్షలతో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదించినట్లు వివరించారు. అన్ని వైద్యశాలల్లో మరిన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా జిల్లా ప్రజల కు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మరమ్మతు పనులు చేపట్టడంతోపాటు పెంబి పీహెచ్సీ నూతన భవన నిర్మాణానికి టెండర్లు పిలిచామని పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య తెలిపారు. ఆన్లైన్ ద్వారా టెండర్ల దాఖలుకు ఈనెల 24 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టర్లకు పనులను అప్పగిస్తామని వివరించారు. పనుల నాణ్యతలో రాజీపడకుండా, పూర్తి పారదర్శకంగా నిర్ధేశించిన గడువులోగా పనులను పూర్తి చేయిస్తామని తెలిపారు.