ఆదిలాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు గురువారం నాలుగో రోజూ ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం కేంద్రంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. గిరిజనులు గుస్సాడీ, బంజారా నృత్యలతో వారికి ఘన స్వాగతం పలికారు. బంజారా మహిళలతో కలిసి మంత్రి నృత్యం చేశారు. ముందుగా రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో రైతుబంధు పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. అనంతరం స్థానిక జూనియర్ కళాశాల విద్యార్థులు వేసిన ముగ్గులను తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతుబంధు సమితి, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు జడ్పీ చైర్ పర్సన్ కొరపెల్లి విజయలక్ష్మి పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో కూడిన ముగ్గులను మంత్రి ఆసక్తిగా తిలకించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం హస్నాపూర్ రైతు వేదిక వద్ద బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బేల మండలం సిర్సన్న గ్రామంలో ఎమ్మెల్యే జోగు రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రైతు వేదికలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నార్నూర్ మండలం బాబేఝరిలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఎడ్లబండ్లతో ర్యాలీ తీశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఊట్నూర్ మండలం తాండ్రలో ఎమ్మెల్యే రేఖానాయక్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాలాభిషేకం చేశారు. కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎడ్లబండ్ల ర్యాలీ తీశారు. పలు మండలాల్లో చిత్రలేఖనం, వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు.
గతంల ఎవుసమంటేనే ఏడుపొచ్చేది..
నా పేరు చౌహన్ రాజేశ్. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గంగాపూర్(తాండా)లో నివాసముంటా. నాకు సర్వే నంబర్ 38/198 3 ఎకరాల 6 గుంటల భూమి ఉంది. సర్కారోళ్లు రైతుబంధు పథకం ద్వారా ఆదుకుంటున్నరు. మొన్ననే నా ఖాతాలో రూ.15,750 పడ్డాయ్. మస్తు సంబురమనిపించింది. మునుపు చేతిలో చిల్లిగవ్వ లేక మస్తు తిప్పలయ్యేది. ఎవుసమంటేనే ఏడుపొచ్చేది. అప్పుల కోసం వ్యాపారుల చుట్టూ తిరిగేది. బతిమిలాడంగ నమ్మకముంటేనే పైసలిచ్చేటోళ్లు. గవ్విటితోనే పొలం పనులు మొదలు చేసేటోళ్లం. ఇగ పైసలు పుట్టకపోతే కూలీ పనికి పోయేటోళ్లం. ఇగ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌సార్ రైతుల బాధల గురించి పట్టించుకున్నడు. రైతుబంధు ద్వారా పెట్టుబడికి సాయం చేస్తుండు. అట్లనే ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తండు. ఎవరైనా చనిపోతే రూ 5 లక్షలిస్తండు. ఇగ గింతకంటే మంచిగ ఎవ్వరు చేస్తరు. కొందరైతే ఏ పనీ చేయరు. చేసినోళ్లను అట్లా.. ఇట్లా అని బద్నాం చేస్తరు. ముఖ్యమంత్రి సార్ రైతులకు మేలు చేసేటోడు. మేమంతా ఆయన వెంటే ఉంటం. వానకాలంలో పత్తి, కంది, పెసర, ఇతర పంటలు వేసిన. ఈసారి శనగ, జొన్న వేసిన.
పంటల టైంకి డబ్బులేస్తన్రు
నా పేరు ముత్యం. మాది భైంసా పట్టణం. నాకు ఐదెకరాల భూమి ఉంది. ఇందులో ఎవుసం చేస్తున్న. ఏటా రైతుబంధు పైసలు పడుతున్నయ్. మొన్ననే రూ. 25 వేలు ఖాతాలో పడ్డట్లు మెసేజ్ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఈ పథకం తీసుకొచ్చినప్పటి నుంచి ఎవుసానికి రంది లేకుంట అయ్యింది. దున్నిపిచ్చేందుకు, ఎరువులు, విత్తనాలు కొనుక్కోవడానికి అక్కరకు వస్తున్నయ్. ఇది వరకు పెట్టుబడికి డబ్బలు దొరికేటివి కావు. తెలిసినోళ్ల దగ్గర మిత్తీలకు అప్పు తెచ్చుకునేది. పంట పండినంక తిరిగి కట్టేటిది. ఒక్కోసారి పంట పండక మస్తు నష్టపోయేది. ఇటు అప్పులు కూడా పెరిగిపోయేటివి. గొసింటి ఎవుసం ఎందుకు అనిపించేది. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధలన్నీ పోయినయ్. అప్పు కోసం ఎవ్వరి దగ్గరికీ పోకుంటైంది. పంట వేసుకునే ముందు సరిగా టైంకి రైతుబంధు డబ్బులేస్తన్రు. మాకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటం.