12న అంబేద్కర్ ఆడిటోరియం భవనం ప్రారంభం
హాజరుకానున్న మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 1 : నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.4.66 కోట్లతో నిర్మించిన బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియం భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వం కృషి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో దశాబ్దాల కల నెరవేరబోతున్నది. ఈ నెల 12న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అటవీ, పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్నది. ప్రభుత్వం వివిధ దశలో నిధులు విడుదల చేయగా, అన్ని వసతులతో ఈ భవనాన్ని మోడల్‌గా తీర్చిదిద్దారు. రెండు అంతస్తుల భవనంలో స్టేజీ, సమావేశ మందిరం, గదులు, వరండా తదితర అధునాతన వసతులు కల్పించారు. 2 వేల మందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా హాలు రూపకల్పన చేశారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేయగా, మంత్రి అల్లోల ప్రత్యేక కృషితో పూర్తి కావడంపై దళిత సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.