
ఆదిలాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి సాగునీటి వనరుల్లోకి భారీగా నీరు చేరగా.. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడి దుంకుతుండగా.. వర్షం నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేలలో నీరు నిల్వ ఉండడంతో రైతులు పంట నష్టపోవాల్సి వస్తున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ఇండ్లలోకి నీరు చేరగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో 18004255566, ఆదిలాబాద్ జిల్లాలో 8106674510 కంట్రోల్ రూం నంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
నిర్మల్‌లో 109 మి.మీ వర్షపాతం
నిర్మల్ జిల్లాలో మంగళవారం 109 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కుంటాల మండలంలో 172 మిల్లీ మీటర్లు, దిలావర్పూర్లో 170.8, కుభీర్‌లో 158.4, భైంసాలో 154.8, లోకేశ్వరంలో 135.2, నర్సాపూర్(జీ)లో 117.8, సారంగాపూర్‌లో 115.6, బాసరలో 109.5, తానూర్‌లో 108.6, లక్ష్మణచాందలో 95.6, మామడలో 95.4 మిల్లీ మీటర్ల వర్షం పడింది. నిర్మల్ జిల్లాలో సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం వరకు 842.7 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా, 1,157.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 74.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. నేరడిగొండ మండలంలో 137.4 మి.మీ, బోథ్‌లో 105.8, బజార్హత్నూర్లో 101.6, ఉట్నూర్‌లో 86.6, ఇచ్చోడలో 82.2 వర్షం పడింది. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం వరకు 877.2 మి.మీ వర్షం పడాల్సి ఉండగా, 1280.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 44,594 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండడంతో ఐదు గేట్లను ఎత్తిన అధికారులు 52,988 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు కూడా వరదతో నిండిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 20,300 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి 24,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గడ్డన్న వాగు ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి 87,985 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. ఆరు గేట్లను ఎత్తిన అధికారులు 86,736 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ స్వర్ణ ప్రాజెక్టుని సందర్శించి ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా మత్తడి వాగు ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి 3,030 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, రెండు గేట్ల ద్వారా 3,280 క్యూసెక్కుల నీటిని అధికారులు విడిచిపెట్టారు. వరద నీటితో సాత్నాల ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టులోకి 5.850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా రెండు గేట్ల ద్వారా 6,090 క్యూసెక్కుల నీటిని అధికారులు బయటకు విడిచిపెట్టారు. మంచిర్యాల జిల్లాలోని నీల్వాయి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 124మీ. కాగా, ప్రస్తుతం 124.020 మీగా ఉంది. ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 70 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువనకు వదిలారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,14,846 క్యూసెక్కులు కాగా, 4,30,290 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పోటెత్తిన గోదావరి
ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకతో బాసర వద్ద గోదావరి ప్రవా హం పెరిగింది. నిత్యహారతి ఘాట్ వద్ద ఉన్న శివలింగాలు నీటమునిగాయి. లక్ష్మణచాంద మండలంలోని పీచర, ధర్మారం, పార్పెల్లి, మునిపెల్లి, చింతల్‌చాంద గ్రామాల్లోని గోదావరి పరీవాహ ప్రాంత తోటలు పూర్తిగా నీటమునిగాయి. వడ్యాల్ గ్రామంలో రెండు ఇండ్లు, లక్ష్మణచాందలోని ఒక ఇల్లు కూలింది. దిలావర్పూర్లోని మాల చెరువుకట్టకు గండి పడగా, ఆయకట్టు పంటలు కొంతమేర నీట ము నిగాయి. భైంసా పట్టణంలోని భారత్ కాటన్, వినాయక్ నగర్, ఆటో నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ గేట్లు తెరవడంతో ఒక్కసారిగా లోతట్టు కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో మూడు రోజులుగా వర్షం కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సింగరేణి గనుల్లోకి వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. నదులు, ప్రాణహిత తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు, పశువులు మేపేందుకు వెళ్లవద్దని పోలీస్, రెవెన్యూశాఖ వారు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వర్షపాతం సరాసరి 38.4 మి.మీ..
జిల్లాలోని 18 మండలాలకుగాను 14 మండలాల్లో మంగళవారం సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 537.6 మిల్లీమీటర్లు కాగా, సరాసరి 38.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. జన్నారం మండలంలో 25.6, దండేపల్లిలో 60.8, లక్షెట్టిపేటలో 62.6, మందమర్రిలో 64.4, మంచిర్యాలలో 72.2, జైపూర్‌లో 54.8, చెన్నూర్‌లో 16.4, కోటపల్లిలో 18.6 మి.మీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మంచిర్యాల డివిజన్లో సోమవారం వరకు సరాసరి 860.2 మి.మీ. నమోదు కాగా, మంగళవారం 375.4 మి.మీ.తో సరాసరి 46.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి డివిజన్లోని కాసిపేట మండలంలో సోమవారం వరకు 815.6 మి.మీ కాగా, మంగళవారం 44.4 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. మంగళవారం తాండూర్ మండలంలో 21.6, భీమినిలో 30.6, వేమనపల్లిలో 20.2 మి.మీ, నెన్నెలలో 14.0, బెల్లంపల్లిలో 31.4 మి.మీగా నమోదైందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా జిల్లాలో మంగళవారం మంచిర్యాల మండలంలో అత్యధికంగా 72.2 మి.మీ, అత్యల్పంగా నెన్నెలలో 14.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి డివిజన్లో సోమవారం వరకు 5,012.5 మి.మీతో 835.4 సరాసరి వర్షపాతం నమోదైంది. మంగళవారం 162.2 మి.మీ.తో సరాసరి 27గా నమోదయ్యిందని వాతావారణశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా, జిల్లాలోని హాజీపూర్, నస్పూర్, భీమారం, కన్నెపల్లి మండలాల్లో రెయిన్ గేజ్ (వర్షమాపకాలు)లు లేవు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం 33.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. జైనూర్‌లో 22.2, సిర్పూర్-యులో 40.6, లింగాపూర్‌లో 75.8. తిర్యాణిలో 26.4. రెబ్బెనలో 26.6. ఆసిఫాబాద్‌లో 39.2. కెరమెరిలో 43.2, వాంకిడిలో 57.6, కాగజ్‌నగర్‌లో 17.0, సిర్పూర్-టీలో 27.8, కౌటాలలో 37.0, చింతలమానేపల్లిలో 35.3, బెజ్జూర్‌లో 30.1, పెంచికల్పేట్లో 12.0, దహెగాంలో 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 922.3 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 1,151.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఇప్పటి వరకు 25 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 9 మండలాల్లో ఇప్పటివరకు అధిక వర్షపాతం నమోదు కాగా, ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వాంకిడి మండలంలో అత్యధికంగా 59 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా చింతలమానేపల్లి మండలంలో 3 శాతం వర్షపాతం నమోదైంది.
జలదిగ్బంధంలో దిందా..
దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దిందా, కేతిని వాగు ఉప్పొంగడంతో దిందా రాకపోకలు నిలిచాయి. ఓ పక్క ప్రాణహిత, మరోపక్క దిందాకు వాగు ఉప్పొంగడంతో గ్రామస్తులు ఎటూ వెళ్లలేక పోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యావసర సరుకులు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం దిందా-కేతిని వాగుపై వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసినప్పటికీ అటవీశాఖ అధికారుల అనుమతి లేక పనులు మొదలు కాలేదని, వెంటనే ప్రారంభించాలని వారు కోరుతున్నారు.