ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 20 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల గోడ పక్కన నిర్మించిన గద్దెపై త్వరలోనే కుమ్రం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆదివాసీ గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సిడాం భీంరావ్, ఆర్కా ఖమ్ము, కనక తుకారాం అన్నారు. ఇంద్రవెల్లిలోని రాధాకృష్ణ మందిరంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కుమ్రం భీం విగ్రహ ఏర్పాటుతో పాటు విరాళాల సేకరణ, ఆవిష్కరణపై చర్చించారు. మండలానికి చెందిన ఆదివాసీ గిరిజన పోలీసులు రమణ, రామారావ్ కుమ్రం భీం విగ్రహ ఏర్పాటు కోసం ఆదివాసీ గిరిజన పెద్దల సమక్షంలో రూ.25వేలు విరాళంగా అందజేశారు. వారికి ఆదివాసీ గిరిజనులు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు ఐక్యమత్యంతో విరాళాలు సేకరించి మండలానికి ఆదర్శంగా నిలువాలన్నారు. కార్యక్రమంలో గిన్నేరా సార్మేడీ జుగాదిరావ్, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నగేశ్, మండలాధ్యక్షుడు భరత్, మండల ఇన్చార్జి సోయం రాందాస్, రాజేందర్, కైలాస్ పాల్గొన్నారు.