నార్నూర్, ఆగస్టు 31 : శ్రావణ మాసంలో మొదలయ్యే తీజ్ పండుగను సేవాలాల్ ఆలయం వద్ద రెండు మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి సంప్రదాయ పాటలు పాడుతూ వేడుక ప్రారంభిస్తారు. ఈ పండుగలో పెళ్లికాని యువతులు తమకు మంచి వరుడు దొరకాలని తొమ్మిది రోజులపాటు కొత్త బుట్టల్లో గోధుమ, శనగ గింజలు చల్లి వాటిని పూజించడం పండుగ ప్రత్యేకత. తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేస్తూ.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మొలకలకు నీరు పోస్తూ యువతులు, మహిళలు వేడుక నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల తర్వాత మొలకెత్తిన వెదురుబట్టులతో తండానాయక్ ఇంటివద్దకు చేరుతారు. మొలకెత్తిన నారుకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడంతో వేడుక ముగుస్తుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తెచ్చుకున్న పిండి వంటకాలను ఒకరికొకరు ఇచ్చుకుని అనురాగం,అప్యాయత పంచుకోవడం లంబాడా గిరిజనుల ప్రత్యేకత.
నియమనిష్ఠలతో పూజలు
తీజ్ వేడుకలను ప్రతి ఒక్కరూ నియమనిష్ఠలతో జరుపుకుంటారు. కొత్త బుట్టల్లో గింజలు వేసి యువతులు పూజలు చేస్తారు. పూజించ పోతే గింజలు మొలకెత్తవని వారి నమ్మకం. తొమ్మిది రోజులపాటు ఒక పూట భోజనం చేయాలి. భోజనంలో తోటకూరను ఉప్పుకారం లేకుండా తీసుకోవాలి. ఇలా నిష్ఠతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం.
ఆడబిడ్డలదే అగ్రస్థానం
తీజ్ ఉత్సవాల్లో ఆడబిడ్డలదే అగ్రస్థానం. వేడుక మొదలైన రోజు నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న అక్కాచెల్లెళ్లను అన్నదమ్ములు పుట్టింటికి తీసుకొస్తారు. వీరికి తొమ్మిది రోజులపాటు అతిథి మర్యాదలు చేస్తారు. చివరి రోజు వీరి కాళ్లు కడిగి నీళ్లు చల్లుకొని పూజలు నిర్వహిస్తారు. ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే గొడ్డు, గోదాతోపాటు పంటలు సమృద్ధిగా లభిస్తాయని విశ్వాసం. ఆషాఢమాసంలో పశువులకు సోకే వ్యాధుల బారి నుంచి జగదాంబదేవి కాపాడుతుందని నమ్ముతారు. అలాగే వర్షాలు సమద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని ప్రాచుర్యం ఉంది.
పులియోగెనో..
ఉత్సవాల్లో ముఖ్యమైనది పులియోగెనో. బం జారా మహిళలు స్వయంగా అద్దాలు, గవ్వలు, పూ సలతో తయారు చేస్తారు. గోధుమలు మొలకెత్తడానికి పవిత్ర జలాలు పోసే సమయంలో వీటిని వినియోగిస్తారు. యువతులు కలశాల్లో జలాలు తీసుకొచ్చేటప్పుడు తలపై పెట్టుకునే దానిని గెనో అని, రెండు కలశాలపై కప్పుకొని వచ్చే దానిని పులియా అన్ని వ్యవహరిస్తారు. పెళ్లి సమయంలో పెళ్లికూతురుకు తమ గుర్తుగా తల్లిదండ్రులు అందిస్తారు.
ఎంతో ఇష్టం..
మొలకల పండుగ తీజ్. గిరిజన యువతులందరికీ ఇష్టమైన పండుగ. నిష్ఠతో ఉండి తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. పెద్దల ఆశీర్వాదాలు మాకు మంచి జీవితాలు ఇస్తాయి. ఈ ఉత్సవాలు జీవితంలో ఒక మధురఘట్టంగా నిలుస్తాయి.
9 రోజులు ఉపవాస దీక్షలు
తీజ్ పండుగ రోజుల్లో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటాం. రొట్టెలు, ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంటాం. దీక్ష పూర్తయితే అంతా మంచి జరుగుతుంది. భావి జీవితం బాగుంటుందనే నమ్మకం.