ఆదిలాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ);కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇక్కడితో ఆగకుండా శుక్రవారం నుంచి నేషనల్ హైవేలపై టోల్ ధరలు పెంచుతూ మరింత భారం మోపింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని జాతీయ రహదారి 44పై మూడు టోల్‌ప్లాజాల్లో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ర్టాలను కలిపే ఈ రహదారి మీదుగా నిత్యం 10 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం పెరిగిన చార్జీలతో, వాహదారులపై మరింత భారం పడనున్నది. చార్జీలు పెంచడంపై ఉన్న శ్రద్ధ జాతీయ రహదారి లోపాలను సవరించడంలో లేదని ఎన్హెచ్ఏఐపై వాహనదారులు, స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోధరల ప్రభావం వల్ల నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా వాహనదారులపై అధికభారం పడుతున్నది. క్రమంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, శుక్రవారం నుంచి జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో వాహనాల ఫీజును పెంచింది. ఆదిలాబాద్, నిర్మల్ జాతీయ రహదారి 44పై మూడు టోల్ ప్లాజాలు ఉండగా శుక్రవారం నుంచి వీటిల్లో వాహనదారుల నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పెంచిన చార్జీలు వసూలు చేస్తున్నారు. ఉత్తరాది రాష్ర్టాల నుంచి దక్షిణాది రాష్ర్టాలకు రోజూ ఈ రహదారిపై పెద్దసంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతాయి. రెండు జిల్లాల ప్రజలు తమ సొంత వాహనాలు, అద్దె వాహనాల్లో తమ అవసరాల కోసం హైదరాబాద్, నాగ్‌పూర్ లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. పెరిగిన ధరలతో వాహన దారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నది.
రోజూ రూ. 15 లక్షల భారం
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని జాతీయ రహదారి 44 పై మూడు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్, నేరడిగొండ మండలం రోల్మామడ, జైనథ్ మండలం పిప్పర్వాడ వద్ద 2008లో ఏర్పాటు చేసి టోల్‌టాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ రహదారిపై రోజూ కార్లు, బస్సులు, లారీలు, గూడ్స్, ఇతర భారీ వాహనాలు 10 వేల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రస్తుతం ఉన్న చార్జీలతో పోలిస్తే భారీగా పన్నులను పెంచారు. ప్రస్తుతం కార్లు, జీపులు లైట్‌మోటర్ వెహికిల్‌పై 24 గంటల్లో రాకపోకలకు గానూ రూ.135 ఉండగా, ఈ చార్జీ రూ.150కి పెరిగింది. మినీ బస్సు, లైట్ కమర్షియల్ వెహికిల్‌కు రూ.215 ఉన్న చార్జీ రూ.240 కి పెంచారు. బస్సులు, ట్రక్‌లకు రూ. 455 ఉన్న చార్జీ రూ. 500కు పెరిగింది. ఇతర భారీ వాహనాలకు రూ.495 ఉన్న ధర రూ. 545కు, రూ.710 ఉన్న రేటు రూ.785కు రూ.865 ఉన్న ధర రూ.955కు పెంచారు. భారీగా పెరిగిన ధరల కారణంగా వాహనదారులు అధిక డబ్బు చెల్లించాల్సి వస్తున్నది. ఆర్టీసీ బస్సులకు కూడా ఈ చార్జీలు పెంచడంతో సంస్థపై, అటు ప్రజలపై భారం పడనున్నది. మూడు టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన ధరల కారణంగా వాహనదారులపై రోజుకు రూ.15 లక్షల భారం పడనున్నది.
అస్తవ్యస్తంగా ఎన్‌హెచ్
రెండు జిల్లాల్లో జాతీయ రహదారి నిర్వహణను ఎన్హెచ్ఏఐ అధికారులు గాలికి వదిలేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ నుంచి జైనథ్ మండలం పిప్పర్వాడ వరకు రోడ్డులో నిర్మాణ లోపాల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జైనథ్ మండలం భోరజ్ చెక్‌పోస్టు సమీపంలో వరుసగా మూడ్రోజులు ప్రమాదాలు జరుగగా ముగ్గురు చనిపోయారు. రోడ్డుకు ఇరువైపులా అవసరమైన చోట సర్వీస్రోడ్డులు, స్లీప్ రోడ్డులు, అండర్‌పాస్‌లు లాంటివి చేపట్టలేదు. ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు గతంలో పలుమార్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులను కోరినా ఫలితం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై గతంలో జందాపూర్ ఎక్స్‌రోడ్, మావల క్రాసింగ్, భోరజ్ చెక్‌పోస్టు, మావల మూలమలుపు, దేవాపూర్ క్రాసింగ్, గుడిహత్నూర్ బస్టాండ్ ఏరియా, గాంధీనగర్, ఉట్నూర్ క్రాస్‌రోడ్డు, సీతాగోంది ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అధికారులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించినా, చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
పెంచుడు పైనే శ్రద్ధ
ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 పైన పోవాలంటే భయం పుడుతున్నది. స్లిప్ రోడ్డులు, అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్డులు నిర్మించకపోవడంతో నిత్యం యాక్సిడెంట్లు అయితున్నయ్. భోరజ్ సమీపంలో ఇటీవల వరుసగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయిన్రు. టోల్‌టాక్స్‌లు పెంచు తున్న నేషనల్ హైవే అథారిటీ అధికారులు, రహదారి గురించి మాత్రం పట్టించుకుంటలేరు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఐదు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి పెంచిన టోల్టాక్స్లతో వాహనదారులు నష్టపోతరు. ధరలు, చార్జీలు పెంచుడు మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసుడు మీద పెడుతలేదు.
–బుట్టి శివకుమార్, ఆదిలాబాద్
ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నం..
కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నది. నిత్యావసర సరకులు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతన్నయి. ఇప్పుడు టోల్‌టాక్స్‌లు పెంచి, బండ్లు పట్టకుండా చేస్తున్నది. ఒక్కో టోల్‌ప్లాజా వద్ద రాను, పోను రూ.150 చెల్లించాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ నుంచి చాలామంది తమ అవసరాల కోసం రోజూ హైదరాబాద్, నాగ్‌పూర్ లాంటి పట్టణాలకు పోయి వస్తుంటరు. టోల్టాక్స్కే రూ.800 వరకు పెట్టుడవుతున్నది. ఎన్హెచ్ఏఐ అధికారులు ఈ విషయంలో ఆలోచించి, పెరిగిన చార్జీలను తగ్గించాలె.
–ఎం.డీ. ఇమ్రానుల్లా, ఆదిలాబాద్
నెలకు రూ. 800 అదనపు భారం ..
సోన్, ఏప్రిల్ 1: నాకు ట్రావెల్ బస్ ఉంది. నిర్మల్ నుంచి హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు నెలకు 20 సార్లు వెళ్లివస్తా. నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్లి రావాలంటే నాలుగు టోల్‌ప్లాజాలు దాటాలి. ప్రస్తుతం ఒక్కొక్క టోల్‌ప్లాజాకు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఇప్పుడు పెంచిన చార్జీలతో నాపై అదనంగా నెలకు రూ. 800 వరకు భారం పడుతది. ఇప్పటికే డీజిల్ ధరలను పెంచి, మా బతుకులను ఆగం చేసిండ్రు. కేంద్రం తీసుకున్న ఈ టోల్ వసూళ్ల రేట్ల నిర్ణయంతో మాకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు టోల్‌ప్లాజాలో పన్నుల భారం వేయడంతో మాకు మరింత ఇబ్బంది ఉంది.
–నర్సారెడ్డి, డ్రైవర్, కాల్వ, దిలావర్పూర్ మండలం
ఎప్పుడూ పెంచుడే…
సోన్, ఏప్రిల్ 1: 20 ఏళ్ల నుంచి జీపు నడుపుతున్న. 2010 వరకు హైదరాబాద్‌కు వెళ్లి రావాలంటే ఒక టోల్‌ప్లాజా లేకుండే. అప్పట్లో డీజిల్ రేట్లు కూడా రూ. 45 ఉండే. ఇప్పుడు డీజిల్ రేటు రూ. 107కు చేసిన్రు. టోల్‌ట్యాక్స్ కూడా ప్రతి ఏడాది వాహనానికి రూ. 5 చొప్పున పెంచుతున్నరు. ఇటు డీజిల్ అటు టోల్ చార్జి పెంచడంతో ఆ భారాన్ని మేము మోయలేక ప్రయాణికులపై వేస్తున్నాం. వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నరు. హైదరాబాద్ వెళ్లే వారు ట్యాక్స్‌లకు భయపడి చాలా మంది బస్సుల్లోనే వెళ్లేందుకు మొగ్గు చూపడంతో మాకు గిరాకీ తగ్గుతోంది. కేంద్రంల బీజేపీ సర్కారు వచ్చినంక అన్ని ధరలు పెరుగుడే తప్ప, తగ్గుడు అయితే సూడలే. ప్రజలకు మంచి చేస్తమని అధికారంలకి వచ్చి మోడీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నది.
–శేఖర్, వెంకటాపూర్, వాహన డ్రైవర్
జాతీయ రహదారులను అమ్మే ప్రయత్నమిది..
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు జాతీయ రహదారులను సైతం పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి ఇటీవల ప్రకటించిన జాతీయ నగదీకరణ పథకం (ఎన్ఎంపీ)లో భాగంగా జాతీయ రహదారులను విక్రయించే పన్నాగాలను ప్రారంభించింది. టోల్‌ప్లాజాలను ఎత్తివేస్తాం.. సంఖ్యను తగ్గిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. ఎన్హెచ్ఏఐ పెంచిన టోల్‌టాక్స్‌లు, ఇప్పటికే పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు ప్రయాణం చేయడం కష్టంగా మారింది. టోల్టాక్స్లను పెంచిన ఎన్హెచ్ఏఐ.. వాహనదారులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. జాతీయ రహదారులను ప్రైవేట్ పరం చేస్తే టోల్‌టాక్స్ ధరలు ఆకాశాన్నంటుతాయి. బస్షెల్టర్లు, తాగునీటి వసతుల ఊసేలేదు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలను తొలగించే ఏర్పాట్లు చేయడం లేదు.
– బాలూరి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు, ఆదిలాబాద్