
ఇచ్చోడ, సెప్టెంబర్ 7 : సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పల్లెల్లో పరిసరాల శుభ్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మండలంలోని నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. దవాఖానకు సంబంధించిన రికార్డులు, వైద్యుల హాజరు పట్టిక, ఇతర రికార్డులను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. హాస్పిటళ్లలో వైద్యులు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
సర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
నర్సాపూర్ పంచాయతీ నిధులను సర్పంచ్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పనులు చేయకుండా నిధులు కాజేశారని కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడం లేదన్నారు. కనీస వసతుల్లేని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలను నిర్మించలేకపోతున్నారని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎంపీడీవో రాంప్రసాద్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. నిధుల దుర్వనియోగంపై డీపీవో, డీఎల్‌పీవోతో ప్రత్యేక విచారణ చేయించి, చర్యలు తీసుకుంటానని ఆమె గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సాధన, ఎంపీడీవో వామనభట్ల రాంప్రసాద్, ఎంపీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శి విజయ్, వైద్యాధికారి రాథోడ్ హిమబిందు, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.