
బోథ్, సెప్టెంబర్ 7: ఆదివాసీ గిరిజన గూడేల్లో మంగళవారం జాగేయ్ మాతరి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పొలాల అమావాస్య మరుసటి రోజున ఈ పండుగను ఏటా నిర్వహిస్తున్నారు. గూడేల్లో ఉదయం ఇంటికొకరు చొప్పున వెదురు కర్రలు చేత పట్టుకొని సద్ధన్నం నైవేద్యాన్ని తీసుకొని ఇళ్ల పైకప్పులను కొడుతూ జాగేయ్ మాతరి అంటూ గ్రామాల శివార్లకు వెళ్లారు. అక్కడ ఓ చెట్టు వద్ద వెదురు కర్రలు ఉంచి పూజ లు చేశారు. దేవతలకు నైవేద్యం సమర్పించారు. చుట్టు పక్కల ఉన్న ఆయుర్వేద వనమూలికలు సేకరించారు. ఊరేగింపుగా ఇళ్లకు తిరిగి వచ్చారు. సేకరించిన వనమూలికలను ఏడాది పాటు జాగ్రత్తగా ఉంచుకొని పిల్లలు భయపడిన సమయంలో వాటితో పొగ పట్టడం, ఇతర వాటికి వినియోగిస్తామని గిరిజనులు తెలిపారు. మండ లంలోని పార్డీ (కే), అందూర్, మందబొగుడ, నాగాపూర్, సాంగ్వి, పార్డీ (బీ), టివిటి, పరుపులపల్లి, నిగిని, రేండ్లపల్లె, నక్కలవాడ, కొత్తపల్లె, లక్ష్మీపూర్, వజ్జర్, గొల్లాపూర్, మామిడిగూడెంలో జాగేయ్ మాతరి వేడుకలను ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు.
ఘనంగా బోడగా పండుగ
నార్నూర్,గాదిగూడ మండలాల్లో ఆదివాసులు బోడగా పండుగను ఘనంగా నిర్వహించారు. గూడేల్లో ఖోడంగ్లతో జాగే మాతరి అంటూ నినాదాలు చేశారు. వనదేవతకు పూజలు చేసి ఖోడంగ్లను శివారులో వదిలేశారు. అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు.